LOADING...
Shubman Gill: ఇంగ్లండ్ గడ్డపై కొత్త చరిత్ర.. కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన గిల్!
ఇంగ్లండ్ గడ్డపై కొత్త చరిత్ర.. కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన గిల్!

Shubman Gill: ఇంగ్లండ్ గడ్డపై కొత్త చరిత్ర.. కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన గిల్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 12, 2025
04:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుత ప్రదర్శనతో ఫాన్స్‌ను ఉత్సాహానికి గురిచేస్తున్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో పరుగుల వరద పారిస్తున్న గిల్, వరుసగా రికార్డులు తన ఖాతాలో వేసుకుంటున్నాడు. పంజాబ్‌కు చెందిన ఈ యువ కెప్టెన్ ఇప్పటివరకు జరిగిన రెండు టెస్టుల్లోనే 585 పరుగులు సాధించాడు. ప్రస్తుతం లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 16 పరుగులు చేసి ఔటైనా.. 9 పరుగుల వద్ద గిల్ మరో రికార్డును అందుకున్నాడు. ఈ మ్యాచ్‌తో కలిసి గిల్ ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా అవతరించాడు. గతంలో ఈ ఘనత విరాట్ కోహ్లీకి (593 పరుగులు - 2018) దక్కింది.

Details

విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు

గిల్ ఐదు ఇన్నింగ్స్‌ల్లోనే 601 పరుగులు చేసి కోహ్లీ రికార్డును అధిగమించాడు. కేవలం భారత కెప్టెన్‌గా మాత్రమే కాకుండా, ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆసియా కెప్టెన్‌గా గిల్ నిలిచాడు. దీనికి ముందు ఆ రికార్డు కూడా కోహ్లీ పేరుపై ఉండేది. ఇక ఈ జాబితాలో అజారుద్దీన్ (426), మియాందాద్ (364), గంగూలీ (351) ఉన్నారు. ఇక భారత్ తరపున ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రాహుల్ ద్రవిడ్ 2002లో 602 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. గిల్ ఈ రికార్డుకు కేవలం ఒక్క పరుగు దూరంలో ఉన్నాడు.

Details

అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించే అవకాశం

రెండో ఇన్నింగ్స్‌లో క్రీజులో దిగగానే ద్రవిడ్ రికార్డును పటాపంచలు చేసే అవకాశం గిల్‌కు ఉంది. ఇంకా రెండు టెస్టులు మిగిలి ఉండటంతో, గిల్ టెస్ట్ సిరీస్‌లో భారత తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించే అవకాశం కూడా కనిపిస్తోంది. ప్రస్తుత రికార్డు యశస్వి జైస్వాల్ పేరిట ఉంది. 2024లో జైస్వాల్ ఐదు టెస్టుల్లో 712 పరుగులు చేశారు. అలాగే 2016లో కోహ్లీ 655 పరుగులు సాధించాడు. ఇప్పుడు అందరి చూపులు గిల్‌పై నెలకొన్నాయి.