NCA: బెంగళూరులో కొత్త 'ఎన్‌సీఏ' ప్రారంభం.. బీసీసీఐ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు
బెంగళూరులో కొత్త జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)ని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్శదర్శి జై షా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఆధ్వర్యంలో ఆదివారం ప్రారంభించారు. ఆధునాతన సౌకర్యాలతో నిర్మించిన ఈ అకాడమీ, భారత క్రికెట్ అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలవనుంది. 2000 సంవత్సరంలో చిన్నస్వామి స్టేడియంలో ప్రారంభమైన ఎన్‌సీఏ, ఇప్పుడు 40 ఎకరాల్లో విస్తరించి, కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో కొత్త ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఈ అకాడమీలో మూడు ప్రపంచ స్థాయి మైదానాలు, మొత్తం 86 పిచ్‌లు, ఇండోర్, అవుట్‌డోర్ నెట్ ప్రాక్టీస్ సౌకర్యాలు ఉన్నాయి.
కొత్త డ్రైనేజ్ టెక్నాలజీ
ప్రధానమైన 'గ్రౌండ్ ఏ'ను ముంబయి ఎర్ర మట్టితో అత్యాధునిక సౌకర్యాలుతో నిర్మించి, ఫ్లడ్ లైట్ల కింద కూడా మ్యాచ్‌లు నిర్వహించేందుకు వీలుగా తీర్చిదిద్దారు. ఇక 75 గజాల విస్తీర్ణంలో నిర్మించిన 'గ్రౌండ్ బీ', 'సీ' మైదానాలు ఆటగాళ్ల ప్రాక్టీస్ కోసం ఆధునాతన సదుపాయాలను కలిగి ఉన్నాయి. పిచ్‌లు ప్రత్యేకంగా మాండ్యా మట్టి, ఒడిశా నుంచి తెచ్చిన నల్ల కాటన్ మట్టితో రూపొందించారు. వర్షం వచ్చినప్పుడు ఆటకి అంతరాయం లేకుండా కొత్త డ్రైనేజ్ టెక్నాలజీని ఉపయోగించారు.
45 అవుట్‌డోర్ నెట్ ప్రాక్టీస్ పిచ్‌లు
45 అవుట్‌డోర్ నెట్ ప్రాక్టీస్ పిచ్‌లు, యూకే, ఆస్ట్రేలియా నుంచి ప్రత్యేకంగా దిగుమతి చేసిన టర్ఫ్‌లతో ఎనిమిది ప్రీమియం పిచ్‌లు సిద్దం చేశారు. ఈ అకాడమీకి 3 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక డ్రెస్సింగ్ రూం, ఇంటిగ్రేటెడ్ కెమెరాలు, స్విమ్మింగ్ పూల్, రీహాబిలిటేషన్ సెంటర్, పెద్ద జిమ్ వంటి సదుపాయాలను జత చేశారు. ఈ అకాడమీ ప్రారంభం భారత క్రికెట్‌కు మరింత ప్రోత్సాహకరంగా నిలుస్తుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.