సిరీస్ ఓటమితో వన్డే వరల్డ్ కప్‌కు అర్హత సాధించని శ్రీలంక
న్యూజిలాండ్ తో జరిగిన చివరి వన్డేలో శ్రీలంక పరాజయం పాలైంది. హామిల్టన్ వేదికగా జరిగిన మూడో వన్డేలో కివీస్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో 2-0తో వన్డే సిరీస్‌ను న్యూజిలాండ్ కైవసం చేసుకుంది. వన్డే వరల్డ్ కప్‌కు నేరుగా అర్హత సాధించాలని భావించిన లంక ఆశలు అవిరయ్యాయి. హామిల్టన్‌లోని సెడాన్ పార్క్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కివీస్ బౌలర్ల ధాటికి 41.3 ఓవర్లలో 157 పరుగులకే లంక కుప్పకూలింది. పాతుమ్ నిస్సాంక (64 బంతుల్లో 57 పరుగులు) చేసి రాణించాడు. చివర్లో కెప్టెన్ షనక (31), కరుణరత్నే (24) పరుగులు చేయడంతో లంక 150 పరుగుల మార్క్‌ను దాటింది.
విజృంభించిన న్యూజిలాండ్ బౌలర్లు
న్యూజిలాండ్ బౌలర్లలో డారిల్ మిచల్, షిప్లే, మాట్ హన్రీ తలా మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం 158 పరుగుల లక్ష్య చేధనకు దిగిన న్యూజిలాండ్ 32.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. విల్ యంగ్(113 బంతుల్లో 86 నాటౌట్, 11 ఫోర్లు), హెన్రీ నికోల్స్(52 బంతుల్లో 44 నాటౌట్, 5 ఫోర్లు) జట్టుకు విజయాన్ని అందించారు. లంక బౌలర్లలో లాహిరు కుమారా రెండు వికెట్లు తీయగా.. దాసున్ షనక, కాసున్ రజితలు చెరో వికెట్ తీశారు. నిస్సాంక 23 వన్డేలో 715 పరుగులు చేశాడు. ఇందులో అరు అర్ధ సెంచరీలు ఉన్నాయి. విల్ యంగ్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు గెలుచుకోగా.. హెన్రీ షిప్లేను ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌ను గెలుచుకున్నాడు.