Page Loader
Nitish Kumar Reddy: ఐపీఎల్ టు బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీ.. నితీశ్ కుమార్ రెడ్డి జర్నీ
ఐపీఎల్ టు బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీ.. నితీశ్ కుమార్ రెడ్డి జర్నీ

Nitish Kumar Reddy: ఐపీఎల్ టు బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీ.. నితీశ్ కుమార్ రెడ్డి జర్నీ

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 29, 2024
09:11 am

ఈ వార్తాకథనం ఏంటి

2024 ఏప్రిల్ 5న, సన్‌ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఐపీఎల్‌లో ఓ కొత్త యువ క్రికెటర్ తన ప్రయాణం మొదలుపెట్టాడు. అతని పేరు అప్పటివరకు క్రికెట్ అభిమానులకు అంతగా తెలియదు. తొలి మ్యాచ్‌లోనూ పెద్దగా రాణించలేకపోయాడు. కానీ, కేవలం ఏడున్నర నెలల్లో అతడు భారత జాతీయ జట్టులో చోటు సంపాదించుకొని ప్రతిష్ఠాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆడుతున్నాడు. ఈ ప్రయాణం అనేక మలుపులు, అవార్డులతో నిండినది.

వివరాలు 

ఐపీఎల్ ప్రదర్శనతో క్రికెట్ రంగంలో నితీశ్ ఎంట్రీ 

ఐపీఎల్ అనేక యువ క్రికెటర్లకు తమ ప్రతిభను చాటుకునే వేదికగా నిలిచింది. నితీశ్ కుమార్ రెడ్డికి కూడా ఇదే జరిగింది. మొదటి మూడు మ్యాచ్‌లలో అతనికి ఆడే అవకాశం రాలేదు. నాలుగో మ్యాచ్‌లో అతను కేవలం 14 పరుగులు మాత్రమే సాధించాడు. అయితే ఆ తర్వాతి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై 37 బంతుల్లో 64 పరుగులు చేయడంతో పాటు ఒక వికెట్ తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. 2024 ఐపీఎల్ సీజన్‌లో 303 పరుగులతో పాటు 3 వికెట్లు తీసి, తన పేరు గుర్తుపడేలా చేశాడు.

వివరాలు 

జాతీయ జట్టులో ప్రవేశం 

ఐపీఎల్‌లో సత్తా చాటిన నితీశ్, బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. దిల్లీలో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో 74 పరుగులు చేయడంతో పాటు 2 వికెట్లు తీసి జట్టు విజయానికి కీలక పాత్ర పోషించాడు. రంజీ ట్రోఫీలో కూడా అద్భుత ప్రదర్శన కారణంగా అతనికి టెస్టు జట్టులో చోటు దక్కింది. అంతే కాకుండా, ప్రతిష్ఠాత్మక బోర్డర్-గావస్కర్ ట్రోఫీ తొలి టెస్టు తుది జట్టులోనూ స్థానం పొందాడు.

వివరాలు 

ఆస్ట్రేలియా గడ్డపై సవాలు 

ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు ఆడడం ఒక క్రికెటర్‌కు పెద్ద పరీక్ష. సీనియర్ ఆటగాళ్లే అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇలాంటి పరిస్థితుల్లో, నితీశ్ తన తొలి ఇన్నింగ్స్‌లో విలువైన 41 పరుగులతో మెరిసాడు. బోర్డర్-గావస్కర్ సిరీస్‌ను సద్వినియోగం చేసుకుంటే అతని కెరీర్‌కు మలుపు తిరుగుతుందని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. జట్టులో కీలక బాధ్యతలు ప్రస్తుతం టీమ్ ఇండియా మిడిలార్డర్ బలహీనంగా ఉంది. నితీశ్ తన బ్యాటింగ్ నైపుణ్యంతో మిడిలార్డర్ లో బ్యాటింగ్‌కు బలాన్ని చేకూరుస్తూ, లోయర్ ఆర్డర్‌తో భాగస్వామ్యాలు నెలకొల్పే బాధ్యతను తీసుకున్నాడు.

వివరాలు 

ఆల్‌రౌండర్‌గా స్థిరపడే అవకాశం 

నితీశ్ బాలింగ్‌లోనూ ప్రభావం చూపుతున్నాడు. ముఖ్యంగా పేసర్లకు మద్దతుగా కొన్ని కీలక ఓవర్లు వేసి, సమయానుకూలంగా వికెట్లు తీయగలిగితే జట్టుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. హార్దిక్ పాండ్య తర్వాత భారత టెస్టు జట్టులో ఒక నమ్మకమైన ఆల్‌రౌండర్ లేమి కనిపిస్తోంది. కాబట్టి, నితీశ్ రెడ్డి ఈ లోటును భర్తీ చేస్తాడా అనేది చూడాలి. ఐపీఎల్ నుంచి జాతీయ జట్టులోకి, అక్కడి నుంచి ప్రతిష్ఠాత్మక సిరీస్ వరకు నితీశ్ ప్రయాణం నిజంగా ప్రేరణాత్మకం. కానీ ఇప్పుడు అతడు మిగిలిన అవకాశం పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. అలా చేస్తే అతని పేరు భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుంది.