ఫార్ములా ఈ క్యాలెండర్‌లో హైదరాబాద్‌కు నో ప్లేస్!
హైదరాబాద్‌లో ఈ ఏడాది ఆరంభంలో నిర్వహించిన ఫార్ములా ఈ రేసుకు అద్భుత స్పందన లభించింది. సిటీలో నాలుగేండ్ల పాటు రేసులు నిర్వహించేలా ఫార్ములాఈ తో తెలంగాణ ప్రభుత్వం, లోకల్ ఆర్గనైజర్ ఏస్ నెక్ట్స్ జెన్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే 2024 సీజన్ కోసం ఏఫ్ఐఏ వరల్డ్ మోటర్ స్పోర్ట్స్ కౌన్సిల్ రూపొందించిన ప్రాథమిక ఫార్ములా ఈ క్యాలెండర్ లో హైదరాబాద్ పేరును ప్రస్తావించలేదు. తుది క్యాలెండర్ కు ఎఫ్ఐఏ వరల్డ్ స్పోర్ట్స్ కౌన్సిల్ ఆమోదం తెలపడానికి ఇంకా సమయం ఉన్నా క్యాలెండరులో హైదరాబాద్‌కు చోటు దక్కకపోవడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. రేస్ ఫైనల్ క్యాలెండర్‌లో హైదరాబాద్‌ను చేర్చడానికి చర్చలు జరుగుతున్నాయని ఫార్ములా ఈ కో ఓనర్ అల్బెర్టో లాంగో తెలిపారు.
టాయిలెట్స్ లేవన్న డ్రైవర్లు
హైదరాబాద్ సిటీలో నిర్వహించిన రేసు విజయవంతం అయినప్పటికీ కొన్ని అంశాలు పెండిగ్ లో ఉన్నాయని, ఈ విషయంలో చర్చలు జరుపుతున్నామని అల్బెర్టో లాంగో పేర్కొన్నారు. గతంలో కొత్త సెక్రటేరియట్ చుట్టూ ఏర్పాటు చేసిన హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్ పై ఫిబ్రవరిలో జరిగిన రేసును చూసేందుకు జనాలు పోటెత్తిన విషయం తెలిసిందే. కానీ సరైన రవాణా సౌకర్యాలు లేక పలువురు అసౌకర్యానికి గురయ్యారు. ముఖ్యంగా టాయిలెట్స్ వంటి కనీస సదుపాయాలు సరిగ్గా లేవని డ్రైవర్లు సైతం ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.