Mohammed Shami: ఐపీఎల్ 2024కు మహమ్మద్ షమీ దూరం
ఐపీఎల్ 2024 నుంచి గుజరాత్ టైటాన్స్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ దూరం అయ్యాడు. మహ్మద్ షమీ ఎడమ చీలమండ గాయం కారణంగా వచ్చే నెలలో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్-2024) కు దూరమయ్యారు. దీని కోసం అతను UKలో శస్త్రచికిత్స చేయించుకోనున్నారు. షమీ చివరిసారిగా నవంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇటీవలే అర్జున అవార్డు అందుకున్న షమీ తన కెరీర్‌లో 229 టెస్టులు, 195 వన్డేలు, 24 టీ20 వికెట్లు పడగొట్టాడు.
షమీకి ఆపరేషన్ తప్ప మరో మార్గం లేదని బీసీసీఐ వెల్లడి
ఇదిలా ఉంటే.. షమీ జనవరి చివరి వారంలో లండన్‌లో తన చీలమండ గాయానికి ప్రత్యేక ఇంజెక్షన్లు చేయించుకున్నాడు. అప్పటికి అతని నొప్పిని తగ్గలేదు.దీంతో అతనికి ఆపరేషన్ తప్ప మరో మార్గం లేదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కాగా.. మహ్మద్ షమీ సర్జరీ కోసం యూకే వెళ్లనున్నట్లు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో షమీ ఐపీఎల్ ఆడటం కష్టమని అంటున్నారు.