Page Loader
Paralympics 2024: నేటి నుంచే పారాలింపిక్స్‌.. భారత్‌ నుంచి 84 మంది
నేటి నుంచే పారాలింపిక్స్‌.. భారత్‌ నుంచి 84 మంది

Paralympics 2024: నేటి నుంచే పారాలింపిక్స్‌.. భారత్‌ నుంచి 84 మంది

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 28, 2024
08:14 am

ఈ వార్తాకథనం ఏంటి

పారా ఒలింపిక్స్‌ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో మరికొన్ని గంటల్లో ఈ క్రీడలు ప్రారంభం కానున్నాయి. ఇటీవల జరిగిన సమ్మర్ ఒలింపిక్స్‌ను విజయవంతంగా నిర్వహించి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన పారిస్‌, ఇప్పుడు పారా ఒలింపిక్స్‌ ద్వారా మరోసారి చక్కని ఆతిథ్యాన్ని ఇవ్వడానికి సిద్దంగా ఉంది. 12 రోజుల పాటు కొనసాగనున్న ఈ మెగా ఈవెంట్‌లో 4,400 మంది పారా అథ్లెట్లు 549 పతకాల కోసం పోటీ పడుతున్నారు. భారతదేశం నుంచి ఈసారి అత్యధికంగా 84 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. ఇది ఒలింపిక్స్‌ చరిత్రలోనే అత్యధికం. 2020 టోక్యో పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు 5 స్వర్ణ పతకాలు సహా మొత్తం 19 పతకాలు గెలుచుకున్నారు.

వివరాలు 

భారత పతాకధారులుగా సుమిత్‌ అంటిల్‌,భాగ్యశ్రీ జాదవ్‌.. 

ఈసారి భారత క్రీడాకారులు అంతకుమించి పతకాలను గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పారిస్‌ పారా ఒలింపిక్స్‌ ప్రారంభ వేడుకల్లో జావెలిన్‌ త్రోయర్‌ సుమిత్‌ అంటిల్‌,షాట్‌ పుటర్‌ భాగ్యశ్రీ జాదవ్‌ భారత పతాకధారులుగా ఉంటారు. వీరిద్దరిపై కూడా భారీ ఆశలు పెట్టుకున్నారు.గత టోక్యో ఒలింపిక్స్‌లో వీరు స్వర్ణ పతకాలు గెలిచారు, అందుకే ఈసారి కూడా అద్భుత ప్రదర్శనను కొనసాగించాలని కోరుకుంటున్నారు. పారిస్‌ పారాలింపిక్స్‌లో ఈసారి భారత ప్రధాన పతకావకాశాలుగా తెలంగాణ యువ అథ్లెట్‌ జివాంజీ దీప్తి,మరియప్పన్‌ తంగవేలు,డిస్కస్‌ త్రోలో యోగేశ్‌ కథునియా,ఆర్చరీ-కాంపౌండ్‌ నుంచి శీతల్‌ దేవి, కృష్ణ నాగర్‌,సుహాస్‌ యతిరాజ్‌ (బ్యాడ్మింటన్‌), భవీనాబెన్‌ పటేల్‌ (టేబుల్‌ టెన్నిస్‌) ఉన్నారు. ఈ క్రీడల ప్రారంభ వేడుకలు భారత కాలమాన ప్రకారం రాత్రి 11:30 గంటలకు ప్రారంభం కానున్నాయి.