IPL-CSK: ఉదయం 9 గంటల వరకు పార్టీ.. కొందరు ఫ్లైట్స్ మిస్ అయ్యారు : డేవన్ కాన్వే
ఐపీఎల్ చరిత్రలో ఐదు టైటిళ్లను గెలిచిన రెండో జట్టుగా చైన్నై సూపర్ కింగ్స్ జట్టు రికార్డుకెక్కిన విషయం తెలిసిందే. ఎంఎస్ ధోనీ సారథ్యంలో సీఎస్కే ఛాంపియన్‌గా నిలిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన సీఎస్కే అన్ని విభాగాల్లో పటిష్టంగా రాణించి కప్పును ఎగరేసుకుపోయింది. ఐపీఎల్ ముగిసి 15 రోజులు గడిచినా ఇప్పటికీ సీఎస్కే ప్లేయర్లు ఆ క్షణాలను నెమరు వేసుకుంటున్నారు. ముఖ్యంగా న్యూజిలాండ్ కీపర్ డేవన్ కాన్వే సీఎస్కే తరుపున ఓపెనర్ గా కీలక ఇన్నింగ్స్ లు ఆడాడు. ధోని నాయకత్వంలో ఆడడం ఎప్పటికీ మరిచిపోలేనని, టైటిల్ నెగ్గిన రోజు కొందరు ఆటగాళ్లు వారు వెళ్లాల్సిన విమానాలను మిస్ చేసుకున్నారని తెలిపాడు.
ధోనీతో ఎక్కువ సమయం గడపడం ఆనందంగా ఉంది : కాన్వే
ఐపీఎల్ ట్రోఫీని నెగ్గడం తమకు సంతోషాన్ని కలిగించిందని, టైటిల్ గెలిచిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో తామంతా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నామని, మరుసటి రోజు ఉదయం 9 గంటలకు పార్టీ కొనసాగిందని, దీంతో కొందరు ఆటగాళ్లు తమ గమ్య స్థానాలకు వెళ్లాల్సిన విమానాలను మిస్ అయ్యారని కాన్వే చెప్పాడు. బౌలింగ్ కన్సల్టెంట్ ఎరిక్ సిమన్స్, డ్వేన్ ప్రిటోరియస్, మొయిన్ అలీ కుటుంబం తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సి వచ్చిందన్నారు. ధోనితో ఎక్కువ సమయం గడపడం ఆనందంగా ఉందని, అతడి పట్ల గౌరవం మాటల్లో చెప్పలేనిదని, క్రికెట్లో అతడు సాధించిన ఘనతలు అపూర్వమని కాన్వే చెప్పుకొచ్చాడు.