Ireland: ఐర్లాండ్ శాశ్వత వైట్-బాల్ కెప్టెన్‌గా పాల్ స్టిర్లింగ్ నియామకం
ఐర్లాండ్ సీనియర్ బ్యాటర్ పాల్ స్టిర్లింగ్ శాశ్వత వైట్-బాల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఐర్లాండ్ జాతీయ సెలెక్టర్లు రాబోయే నాలుగేళ్లలో ఆడబోయే రెండు T20 ప్రపంచ కప్‌లు,ఒక 50- ఓవర్ల ఈవెంట్‌పై దృష్టి పెట్టారు. ఆండ్రూ బాల్‌బిర్నీ టెస్టు కెప్టెన్సీని కొనసాగించనున్నాడు. ఈ జూలైలో బాల్‌బిర్నీ వైదొలిగినప్పుడు వైట్-బాల్ ఫార్మాట్‌లలో తాత్కాలిక కెప్టెన్‌గా స్టిర్లింగ్ నియమితుడయ్యాడు.ఇప్పుడు శాశ్వత వైట్-బాల్ కెప్టెన్‌గా నియమించబడ్డాడు. 33 ఏళ్ల స్వాష్‌బక్లింగ్ ఓపెనర్ స్టిర్లింగ్ ఇప్పటికే రెండు ఫార్మాట్లలో (6 ODIలు, 16 T20Iలు) 22 మ్యాచ్‌లలో జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు.
2027లో జరిగే తదుపరి 50 ఓవర్ల ప్రపంచ కప్ టార్గెట్ : స్టిర్లింగ్
కెప్టెన్‌గా ఎంపికైన పాల్ స్టిర్లింగ్ మాట్లాడుతూ ఐర్లాండ్ కోసం ఆడటం తనకు ఎప్పుడూ గర్వకారణంగా ఉంటుందన్నారు.శాశ్వత వైట్-బాల్ కెప్టెన్‌గా ఎంపిక అవుతానని అనుకోలేదని అన్నాడు. గత కొన్ని నెలలుగా తాత్కాలిక కెప్టెన్‌గా హెన్రిచ్,మలన్ కోచింగ్ స్టాఫ్‌తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందన్నాడు. అయితే రాబోయే నాలుగు సంవత్సరాలలో మూడు ప్రపంచ కప్ లలో రాణించడానికి ఇప్పటి నుండే అద్భుతంగా ఆడడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. 2027లో జరిగే తదుపరి 50 ఓవర్ల ప్రపంచ కప్ ఈవెంట్‌లో ఐర్లాండ్ జట్టు ఉండడం కోసం కృషి చేస్తామని పాల్ స్టిర్లింగ్ అన్నాడు.
ఐర్లాండ్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు స్టిర్లింగ్
ప్రధాన కోచ్ హెన్రిచ్ మలన్ పాల్ స్టిర్లింగ్ నియామకంపై హర్షం వ్యక్తం చేశారు. స్టిర్లింగ్ అనుభవం ఐరిష్ జట్టుకు ప్లస్ అవుతుందని అన్నారు. ఇప్పటి వరకూ అన్ని ఫార్మాట్లు కలిపి 376 మ్యాచ్ లు ఆడిన స్టిర్లింగ్ 11,756 రన్స్ చేశాడు. ఐర్లాండ్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కూడా స్టిర్లింగ్ కావడం గమనార్హం.