Narendra Modi: 'భారత క్రీడా పథంలో కొత్త అధ్యాయం'.. చెస్ ఒలింపియాడ్ బంగారు పతకాలపై ప్రధాని మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ చెస్ ఒలింపియాడ్‌లో బంగారు పతకాలు సాధించడంపై స్పందించారు. అమెరికా పర్యటనలో ఉన్న మోదీ, సీఈవోలు, అగ్రనేతలతో వరుసగా భేటీ అవుతున్నప్పటికీ, చెస్ ఒలింపియాడ్‌లో భారత్ స్వర్ణాలు గెల్వడంపై ఆనందం వ్యక్తం చేసారు. ''భారత క్రీడా రంగంలో ఇది ఒక సరికొత్త అధ్యాయం. ఇది భవిష్యత్తు తరాలకు ప్రేరణగా నిలుస్తుంది. మరింతమంది చెస్‌ను కెరీర్‌గా ఎంచుకునేలా మార్గం చూపుతుంది. విజేతలకు హృదయపూర్వక శుభాకాంక్షలు'' అని మోదీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణ పతకాలు సాధించిన ప్లేయర్లను అభినందించారు.
భారత చెస్‌లో ఇదొక అద్భుతం: చంద్రబాబు
''ఇది భారత చదరంగంలో ఒక చారిత్రాత్మక విజయం.చెస్ ఒలింపియాడ్ 2024లో రెండు స్వర్ణ పతకాలు గెలిచి దేశాన్నిగర్వపడేలా చేశారు.ఈగెలుపులో మన తెలుగు ఛాంపియన్లు,ద్రోణవల్లి హారిక, పెండ్యాల హరికృష్ణ,ఉండటం ఎంతో గర్వకారణం''అని చంద్రబాబు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. 45వ చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్లు రెండుస్వర్ణ పతకాలను సాధించాయి.ఉత్కంఠభరిత పోటీలతో భారత పురుషుల జట్టు ఓపెన్ విభాగంలో 21 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని గెలిచింది. 11వ రౌండ్‌లో స్లోవేనియాను 3.5-0.5తేడాతో ఓడించడంతో ఈ విజయం సాధ్యమైంది.అదే విధంగా మహిళల జట్టు కూడా అజర్‌బైజాన్‌ను 3.5-0.5 తేడాతో ఓడించింది. 10 రౌండ్ల తర్వాత భారత్ 19పాయింట్లతో, చైనా 17పాయింట్లతో మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. చివరి రౌండ్‌లో టై అయినా,భారత్ అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచింది.