Page Loader
Preity Zinta: పంజాబ్‌ కింగ్స్‌ జట్టులో అంతర్గత ఘర్షణలు.. కోర్టు మెట్లు ఎక్కిన ప్రీతి జింటా !
పంజాబ్‌ కింగ్స్‌ జట్టులో అంతర్గత ఘర్షణలు.. కోర్టు మెట్లు ఎక్కిన ప్రీతి జింటా !

Preity Zinta: పంజాబ్‌ కింగ్స్‌ జట్టులో అంతర్గత ఘర్షణలు.. కోర్టు మెట్లు ఎక్కిన ప్రీతి జింటా !

వ్రాసిన వారు Sirish Praharaju
May 23, 2025
11:00 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌లో పాల్గొంటున్న పంజాబ్‌ కింగ్స్‌ జట్టులో అంతర్గత వివాదం చెలరేగింది. జట్టు సహ యజమాని,బాలీవుడ్‌ నటి అయిన ప్రీతి జింటా కోర్టును ఆశ్రయించారు. జట్టుకు చెందిన మరో ఇద్దరు సహ డైరెక్టర్లైన మోహిత్‌ బుర్మాన్‌, నెస్‌ వాడియాలపై ఆమె చండీగఢ్‌ కోర్టులో కేసు దాఖలు చేశారు. కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా సమావేశాన్ని నిర్వహించారనే ఆరోపణలతో ఆమె పిటిషన్‌ వేశారు. ఈ ముగ్గురూ కలిసి కేపీహెచ్‌ డ్రీమ్‌ క్రికెట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థకు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. పంజాబ్‌ కింగ్స్‌ జట్టు ఈ సంస్థ ఆధీనంలో ఉంది.గత నెల 21వ తేదీన ఈ సంస్థకు చెందిన అత్యవసర సర్వసభ్య సమావేశం (EGM) నిర్వహించారు.

వివరాలు 

సమావేశం చట్టబద్ధంగా జరగలేదు 

అయితే ఈ సమావేశం చట్టబద్ధంగా జరగలేదని ప్రీతి జింటా కోర్టులో పేర్కొన్నారు. కంపెనీ చట్టం-2013 ప్రకారం తప్పనిసరిగా పాటించాల్సిన విధివిధానాలను లెక్కచేయకుండా ఈ సమావేశాన్ని నిర్వహించారని ఆమె ఆరోపించారు. ఈ సమావేశానికి సంబంధించి తాను ఎప్రిల్‌ 10న ఈమెయిల్‌ ద్వారా అభ్యంతరాలను తెలియజేసినా, వాటిని పట్టించుకోలేదని ఆమె తన పిటిషన్‌లో స్పష్టం చేశారు. మోహిత్‌ బర్మాన్‌ ఈ సమావేశాన్ని నెస్‌ వాడియా మద్దతుతో నిర్వహించారని ఆరోపించారు. తాను,మరో డైరెక్టర్‌ కరణ్‌పాల్‌ ఈ సమావేశానికి హాజరయ్యారని, అయినప్పటికీ ఈ సమావేశం చట్టబద్ధత చెల్లదని ప్రకటించాలని కోర్టును ఆమె కోరారు. ఈ సమావేశంలో మునీశ్‌ ఖన్నాను డైరెక్టర్‌గా నియమించడాన్ని ఆమె,కరణ్‌పాల్‌ వ్యతిరేకించారు. ఖన్నా నియామకాన్ని నిలిపివేయాలని ఆమె కోర్టులో విజ్ఞప్తి చేశారు.

వివరాలు 

11 ఏళ్ల విరామం తర్వాత జట్టు ప్లేఆఫ్స్‌ దశకు.. 

ఈ సమావేశంలో తీసుకున్న ఏ నిర్ణయాన్ని కూడా అమలు చేయకుండా చూడాలని కోర్టును కోరారు. అంతేకాకుండా, ఈ వివాదానికి పరిష్కారం వచ్చే వరకు తాను, కరణ్‌పాల్‌ను లోపలికి లేకుండా ఏ బోర్డు సమావేశాలు జరగకూడదని కోర్టును అభ్యర్థించారు. ఇంత వివాదం నడుస్తున్నా కూడా ప్రీతి జింటా పంజాబ్‌ కింగ్స్‌ జట్టుకు ప్రోత్సాహం అందించేందుకు స్టేడియానికి వచ్చారు. ఆటగాళ్లను ఉత్సాహపరిచారు. ఇక శ్రేయస్‌ అయ్యర్‌ నేతృత్వంలోని పంజాబ్‌ కింగ్స్‌ జట్టు ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేస్తోంది. 11 ఏళ్ల విరామం తర్వాత జట్టు ప్లేఆఫ్స్‌ దశకు చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టాప్‌ 2లో స్థానం దక్కించుకునే దిశగా దూసుకెళ్తోంది.