Page Loader
PV Sindhu: పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు
పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు

PV Sindhu: పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 23, 2024
08:33 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత బ్యాడ్మింటన్‌ చాంపియన్ పివి.సింధు, పోసిడెక్స్‌ టెక్నాలజీస్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెంకట దత్తసాయి వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. ఆదివారం ఉదయ్‌పూర్‌లోని ఒక దీవిలో కుటుంబ సభ్యులు,అత్యంత సన్నిహితుల మధ్య ఈ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. సంప్రదాయ తెలుగు ఆచారాలతో, శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ వేడుకలో పండితుల వేద మంత్రాల నడుమ రాత్రి 11.20 గంటలకు దత్తసాయి సింధు మెడలో మూడు ముళ్లు వేశాడు. సుమారు 140 మంది అతిథులు,కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఈ వేడుక అట్టహాసంగా సాగింది. తెలుగుదనానికి అనుగుణంగా,రాజస్థాన్‌ రాచరిక సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకకు ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సభ్యుడు చాముండేశ్వర్‌నాథ్‌,వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌, ప్రముఖ వైద్యుడు గురువారెడ్డి తదితరులు హాజరయ్యారు.

వివరాలు 

పెళ్లి వేదిక ప్రత్యేకత 

మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో ఈ కొత్త జంట వివాహ రిసెప్షన్‌ నిర్వహించనున్నారు. సింధు వివాహం ఉదయ్‌సాగర్‌ సరస్సులోని 21 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఒక దీవి వద్ద జరిగింది. ఆరావళి పర్వతాల నడుమ ఉన్న ఈ ప్రత్యేక స్థలంలో రఫల్స్‌ సంస్థ నిర్మించిన,రాజప్రసాదాన్ని తలపించే భవంతులతో కూడిన రిసార్ట్‌ ఏర్పాటు చేశారు. ఇందులో వంద గదులతో మూడు ప్రధాన భవంతులు ఉన్నాయి.వివాహం కోసం అతిథులను ప్రత్యేక పడవల్లో వేదికకు తీసుకెళ్లారు. ఈ రిసార్ట్‌లో సాధారణ గదికి రోజుకు అద్దె రూ.లక్ష వరకు ఉంటుందని తెలిసింది. సింధు కుటుంబం ఈ వివాహ వేడుక కోసం మొత్తం 100 గదులను బుక్‌ చేయడమే కాకుండా, వివాహానికి హాజరైన వారికోసం ప్రత్యేక విమాన టిక్కెట్లు కూడా అందించింది.