PV Sindhu : పీవీ సింధు మోకాలికి గాయం.. రెండు నెలలు ఆటకు దూరం!
రెండుసార్లు ఒలింపిక్ పతకాల విజేత, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి.సింధు గాయపడింది. ఆమె ఎడమ మోకాలుకు స్వల్పంగా క్రాక్ వచ్చినట్లు వైద్యులు గుర్తించారు. స్కాన్ తీసిన తర్వాత ఆమె విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. గతవారం రెన్నిస్‌లో జరిగిన సూపర్ ఓపెన్ రెండో రౌండ్‌లో సింధు గాయం కారణంగా తప్పుకున్న విషయం తెలిసిందే. థాయిలాండ్‌కు చెందిన సుపనిదా కటేతాంగ్‌తో మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఆమె గాయపడింది. విశ్రాంతి తీసుకోవడం వల్ల రాబోయే ఒలింపిక్స్ క్రీడలపై ఫోకస్ పెడతానని, త్వరలోనే మళ్లీ కోర్టులో అడుగుపెట్టనున్నట్లు పీవీ సింధు తెలిపారు.
టాప్-10లో పీవీ సింధు
ప్రస్తుత సీజన్‌లో పీవీ సింధు పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తోంది. దాదాపు ఆరేళ్ల తర్వాత మళ్లీ ఇటీవలే ఆమె టాప్ 10లో చోటు దక్కించుకుంది. ఇక ఆర్కిటిక్ ఓపెన్, డెన్మార్ట్ ఓపెన్ టోర్నీల్లో ఆమె సెమీస్‌కు చేరడంతో ర్యాంక్ కొంత మెరుగుపడుతుంది. మరోవైపు నవంబర్ 7 నుంచి 12 వరకు కొరియా మాస్టర్స్ జరగనున్నాయి. నవంబర్ 14 నుంచి 19 వరకు జపాన్ మాస్టర్స్, నవంబర్ 21 నుంచి 26 వరకు చైనా మాస్టర్స్, నవంబర్ 28 నుంచి డిసెంబర్ 3 వరకు సయ్యిద్ మోదీ ఇండియా ఇంటర్నేషనల్ టోర్నీలు జరగనున్నాయి.