SA vs IND : గిల్ ఇలా ఆడితే కష్టమే.. అతని స్థానంలో వారిద్దరికి ఛాన్స్ : డీకే
భవిష్యత్తు భారత సూపర్ స్టార్‌గా జూనియర్ విరాట్ కోహ్లీగా పేరుగాంచిన టీమిండియా యువ ఓపెనర్ శుభమన్ గిల్ (Shubman Gill) గత కొన్ని మ్యాచుల్లో నిరాశపరిచాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులోనూ పేలవ ప్రదర్శనతో విమర్శలను మూటకట్టుకున్నాడు. ఇక బుధవారం నుంచి దక్షిణాఫ్రికా, టీమిండియా జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచుల్లోనూ, వచ్చే మ్యాచుల్లోనూ గిల్ మంచి ప్రదర్శన ఇవ్వకపోతే ఇతర క్రికెటర్లు అతడి స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉందని భారత సీనియర్ ఆటగాడు దినేశ్ కార్తీక్(Dinesh Karthik) పేర్కొన్నాడు. మరీ ముఖ్యంగా ఆ స్థానం కోసం సర్ఫరాజ్ ఖాన్, రజత్ పటీదార్ వేచి చూస్తారని తెలిపాడు.
రెండో టెస్టులో స్పిన్ ఆల్ రౌండర్ ను మార్చాలి
ప్రస్తుతం గిల్ అంచనాలకు తగ్గట్టుగా ఆడటంలో విఫలమవుతున్నాడు. ఈ సీజన్‌లో జరిగే టెస్టుల్లో మెరుగైన ప్రదర్శన చేయకపోతే మాత్రం మేనేజ్ మెంట్ దృష్టి సారించే అవకాశాలు లేకపోలేదు. మిడిలార్డర్ రజత్ పటిదార్ బలమైన పోటిదారుడిగా ఉన్నాడని, గిల్ ఇక నుంచైనా జాగ్రత్తగా ఆడుతూ పరుగులు రాబట్టాలని డీకే వెల్లడించారు. రెండో టెస్టులో స్పిన్ ఆల్ రౌండర్ ను మార్చాలని భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యానించాడు. రవీంద్ర జడేజా ఫిట్‌గా ఉన్నాడని, ఏడో స్థానంలో అతను పరుగులు తీస్తాడని చెప్పారు.