యూరప్ నడిబొడ్డున రెస్టారెంట్‌ను ఓపెన్ చేసిన సురేష్ రైనా.. పిక్స్ వైరల్
టీమిండియా సీనియర్ క్రికెటర్ సురేష్ రైనా గతేడాది సెప్టెంబర్‌లో క్రికెట్ కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా రైనా కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. యూరప్ నడిబొడ్డున నెదర్లాండ్స్ రాజధాని ఆమ్‌స్టర్‌డామ్‌లో ఇండియన్ రెస్టారెంట్ ను ప్రారంభించాడు. ఆ రెస్టారెంట్ కి 'రైనా ఎస్ ఆర్' అని నామకరణం చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో రైనా పోస్టు చేశాడు. అదే విధంగా రెస్టారెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా రైనా స్వయంగా వంట కూడా చేయడం గమనార్హం. రైనా క్రికెటరే కాదు మంచి చెఫ్ కూడా అని చెప్పొచ్చు. తొలి రోజు రైనానే తనకు ఇష్టమైన వంటకాన్ని చేసి గెస్టులకు వడ్డించడం విశేషం.
రెస్టారెంట్ ను ప్రారంభించడంపై హర్షం వ్యక్తం చేసిన రైనా
ఆమ్‌స్టర్‌డామ్ లో రైనా ఇండియన్ రెస్టారెంట్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని, ఇక్కడ ఆహారం, వంట పట్ల తనకున్న ప్రేమ వల్లే రెస్టారెంట్ ను ప్రారంభించానని, ఎంతో అనుభవం ఉన్న చెఫ్‌లు చేసిన ఇండియన్ వంటకాలు ఈ రెస్టారెంట్ లో లభ్యమవుతాయని రైనా చెప్పారు. దక్షిణ భారతదేశ ఘుమఘుమలు తన రెస్టారెంట్‌కు వచ్చిన వారికి అందిస్తానని, ఇందులో వంటకాలు మాత్రమే కాదని, నాణ్యత ప్రమాణాలు, ప్రతి డిష్‌లోనూ సంపూర్ణ సంతృప్తిని అందిస్తామని పేర్కొన్నారు. రైనా రెస్టారెంట్ ను ప్రారంభించడంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు అల్ ది బెస్ట్ అని కామెంట్లు పెడుతున్నారు.