LOADING...
Sangakkara: సన్‌రైజర్స్ మ్యాచ్ ముందు రియాన్ పరాగ్‌పై సంగక్కర కామెంట్స్.. ఏమన్నాడంటే?
సన్‌రైజర్స్ మ్యాచ్ ముందు రియాన్ పరాగ్‌పై సంగక్కర కామెంట్స్.. ఏమన్నాడంటే?

Sangakkara: సన్‌రైజర్స్ మ్యాచ్ ముందు రియాన్ పరాగ్‌పై సంగక్కర కామెంట్స్.. ఏమన్నాడంటే?

వ్రాసిన వారు Moogati Shabari
Apr 25, 2026
05:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగనున్న మ్యాచ్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఫామ్‌పై ప్రధాన కోచ్ కుమార సంగక్కర స్పందించాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడి ఐదు విజయాలు నమోదు చేసి 10 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్‌తో పాటు బౌలర్లు జట్టుకు విజయాలు అందించారు. అయితే కెప్టెన్ రియాన్ పరాగ్ నుంచి ఇప్పటివరకు గుర్తుండిపోయే ఇన్నింగ్స్ మాత్రం రాలేదు. దీంతో నాయకత్వంలో మెప్పిస్తున్నప్పటికీ, బ్యాటింగ్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

వివరాలు

ఫ్రాంచైజీ తరపున పూర్తి మద్దతు..

ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఇవాళ రాత్రి జరగనున్న మ్యాచ్‌కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో సంగక్కర రియాన్ పరాగ్‌పై తన అభిప్రాయం వెల్లడించాడు. గత కొన్ని మ్యాచ్‌లలో రియాన్ మంచి బ్యాటింగ్ చేశాడని, కానీ కొన్నిసార్లు బాగా ఆడినా పెద్ద స్కోరు చేయడం సాధ్యంకాదని సంగక్కర అన్నాడు. ఒకవేళ బంతిని అంచనా వేయడంలో సమస్యలు ఉంటే ఆందోళన చెందేవాడినని, కానీ అలాంటి పరిస్థితి లేదని స్పష్టం చేశాడు. రియాన్ కాస్త ఎక్కువసేపు క్రీజ్‌లో నిలబడి కొన్ని పరుగులు చేస్తే సరిపోతుందని, ఒక మంచి ఇన్నింగ్స్‌తో ప్రస్తుతం ఉన్న అన్ని సందేహాలకు సమాధానం చెబుతాడని పేర్కొన్నాడు. ఫ్రాంచైజీ తరఫున అతడికి పూర్తి మద్దతు ఉంటుందని కూడా తెలిపాడు.

వివరాలు

రియాన్ పరాగ్‌పై ఒత్తిడి..

నాయకుడిగా జట్టును ఎలా ముందుకు నడిపిస్తున్నాడన్నదే తాము ముఖ్యంగా గమనిస్తున్నామని సంగక్కర చెప్పాడు. గత మ్యాచ్‌లో కూడా అతడు జట్టును సమర్థంగా నడిపించాడని, ఒత్తిడి సమయంలో సరైన నిర్ణయాలు తీసుకున్నాడని ప్రశంసించాడు. ఇంకా నేర్చుకుంటూ మరింత మెరుగవుతున్నాడని అన్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున కెరీర్ ప్రారంభం నుంచి రియాన్ పరాగ్ లాంటి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్న మరో ఆటగాడిని చూడలేదని సంగక్కర పేర్కొన్నాడు. సోషల్ మీడియాలో అతడిపై ఎన్నో విమర్శలు వచ్చినా, వాటిని పక్కనపెట్టి మంచి కెప్టెన్‌గా జట్టును నడిపిస్తున్నాడని కొనియాడాడు.

Advertisement