Ravichandran Ashwin : ప్రపంచ రికార్డుకు దగ్గర్లో రవిచంద్రన్ అశ్విన్
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనతను సాధించేందుకు సిద్ధంగా ఉన్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 120 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలవడానికి అశ్విన్‌కు కేవలం 5 వికెట్లు దూరంలో ఉంది. బ్రిస్బేన్ వేదికగా శనివారం నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్ట్‌లో అశ్విన్ ఐదు వికెట్లు తీసుకుంటే ఈ మైలురాయిని చేరుకుంటాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్ 118 వికెట్లతో ఈ రికార్డుకు దగ్గరగా ఉన్నాడు. నాథన్ లయన్ 120 వికెట్లు పూర్తిచేసేందుకు 2 వికెట్లు మాత్రమే అవసరం. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అశ్విన్ ప్రస్తుతం 23 టెస్ట్‌లలో 115 వికెట్లు తీశాడు. అనిల్ కుంబ్లే 20 టెస్టుల్లో 111 వికెట్లు, హర్భజన్ సింగ్ 18 టెస్ట్‌లలో 95 వికెట్లు తీశాడు.
తుది జట్టులో అశ్విన్ కు అవకాశం?
మరొక స్పిన్నర్ రవీంద్ర జడేజా 16 టెస్ట్‌లలో 85 వికెట్లు తీశాడు. అయితే ఈ బ్రిస్బేన్ టెస్ట్‌లో అశ్విన్ ఆడుతాడా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా తొలి టెస్ట్‌లో పెర్త్ వేదికగా 295 పరుగుల భారీ విజయం సాధించినప్పటికీ, అడిలైడ్ వేదికపై జరిగిన పింక్ బాల్ టెస్ట్‌లో 10 వికెట్ల తేడాతో పరాజయం ఎదురైంది. అశ్విన్ తొలి టెస్ట్‌లో ఆడలేకపోయినా రెండో టెస్ట్‌లో అతను 18 ఓవర్లు వేసి ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. అయితే బ్రిస్బేన్ టెస్ట్‌లో తుది జట్టులో అశ్విన్‌కు అవకాశం ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. గబ్బా మైదానంలో పేసర్లతో పాటు స్పిన్నర్లు కూడా కీలక పాత్ర పోషించగలరని టీమిండియా మేనేజ్‌మెంట్ ఆలోచిస్తుంది.