Page Loader
Virat Kohli : లక్నోతో కీలక పోరు... కోహ్లీని ఊరిస్తున్న రికార్డులివే!
లక్నోతో కీలక పోరు... కోహ్లీని ఊరిస్తున్న రికార్డులివే!

Virat Kohli : లక్నోతో కీలక పోరు... కోహ్లీని ఊరిస్తున్న రికార్డులివే!

వ్రాసిన వారు Sirish Praharaju
May 27, 2025
03:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2025 సీజన్‌లో చివరిగా జరగనున్న లీగ్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. మంగళవారం నాడు లక్నోలోని భారతి ఎకానా క్రికెట్ స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌ను గెలిచి విజయవంతంగా సీజన్‌ను ముగించాలనే ఆలోచనతో లక్నో జట్టు ఉంది. మరోవైపు, ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన బెంగళూరు జట్టు, పాయింట్ల పట్టికలో టాప్-2లో చోటు దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కీలకమైన పోరుకు ముందు ఆర్‌సీబీ స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీని పలు రికార్డులు ఊరిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో కోహ్లీ కేవలం 24 పరుగులు చేయగలిగితే, ఆర్‌సీబీ తరపున మొత్తం 9000 పరుగుల మైలురాయిని చేరుకుంటాడు.

వివరాలు 

డేవిడ్ వార్నర్ రికార్డును బద్దలుకొట్టే అవకాశం 

విరాట్ కోహ్లీ ఐపీఎల్ ప్రారంభం నుంచే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపునే ఆడుతున్నాడు. ఐపీఎల్‌తో పాటు ఛాంపియన్స్ లీగ్ మ్యాచ్‌ల్లో కలిపి 270ఇన్నింగ్స్‌లలో బరిలోకి దిగిన అతను ఇప్పటివరకు 8976 పరుగులు సాధించాడు. అందులో ఛాంపియన్స్ లీగ్ టి20 మ్యాచ్‌ల్లో 424పరుగులు, ఐపీఎల్‌లో 256ఇన్నింగ్స్‌ల్లో 8552 పరుగులు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక హాఫ్ సెంచరీలు నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ సమానంగా 62 హాఫ్ సెంచరీలతో ఉన్నారు. అయితే మంగళవారం లక్నోతో జరిగే మ్యాచ్‌లో కోహ్లీ మరో అర్ధశతకం సాధిస్తే,వార్నర్‌ను అధిగమించి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలవనున్నాడు. వీరిద్దరి తర్వాతి స్థానంలో 46 హాఫ్ సెంచరీలతో రోహిత్ శర్మ ఉన్నాడు.

వివరాలు 

 ఆర్‌సీబీ ఖాతాలో 17 పాయింట్లు 

ఈ సీజన్‌లో కోహ్లీ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటి వరకూ 12మ్యాచ్‌లలో పాల్గొన్న అతను 548 పరుగులు సాధించాడు. ఆర్‌సీబీ ఇప్పటి వరకూ ఈ సీజన్‌లో 13లీగ్ మ్యాచ్‌లు ఆడింది.వాటిలో 8 విజయాలు సాధించగా, 4 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది.ప్రస్తుతం ఆర్‌సీబీ ఖాతాలో 17 పాయింట్లు ఉన్నాయి. నెట్ రన్‌రేట్ +0.255గా ఉంది.పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. లక్నోపై గెలిచినట్లయితే,బెంగళూరు జట్టు టాప్-2లో నిలిచి క్వాలిఫయర్-1కి అర్హత పొందుతుంది. అయితే,ఈ మ్యాచ్‌లో ఓడిపోతే గుజరాత్ టైటాన్స్ జట్టు టాప్-2లోకి ప్రవేశించి క్వాలిఫయర్-1లో అడుగుపెడుతుంది. ఇదే సమయంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ముంబైపై గెలిచిన పంజాబ్ కింగ్స్ ఇప్పటికే క్వాలిఫయర్-1లోకి ప్రవేశించిన విషయం విదితమే.