శుభ్‌మన్ గిల్ స్టన్నింగ్ సెంచరీతో రికార్డు బద్దలు
యువ బ్యాటింగ్ సంచలనం శుభ్‌మన్ గిల్ మరోసారి సంచలనాత్మక ఇన్నింగ్స్‌ను ఆడాడు. సిరీస్ గెలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గిల్ చెలరేగి ఆడాడు. గిల్‌తో పాటు రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా కూడా బ్యాట్ ఝుళిపించడంతో భారత్ 166 పరుగుల తేడాతో విజయం సాధించింది. 63 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లతో 126 పరుగులు చేసిన గిల్.. భారత్ తరుఫున టీ20 ఫార్మాట్లో హైస్కోరర్‌గా నిలిచాడు. గతేడాది ఆఫ్ఘనిస్తాన్‌పై అజేయంగా 61 బంతుల్లో 122 పరుగులు చేసిన విరాట్‌కోహ్లీ రికార్డును గిల్ బద్దలు కొట్టాడు. 2015లో దక్షిణాఫ్రికాపై 66 బంతుల్లో 106 పరుగులు చేసి రోహిత్‌శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు.
గిల్ సాధించిన రికార్డులివే
భారత్ తరఫున మూడు ఫార్మాట్లలోనూ సెంచరీ చేసిన ఐదో బ్యాట్స్‌మ్యాన్‌గా శుభ్‌మన్ గిల్ నిలిచాడు. అంతకు ముందు ఈ ఘనతను సురేశ్ రైనా, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీలు సాధించారు. టీ20లో సెంచరీ చేసిన పిన్న వయస్కుడిగా కూడా శుభ్‌మన్ గిల్ నిలిచాడు. 23 ఏళ్ల 146 రోజుల వయసులో గిల్ ఈ ఘనతను సాధించడం ద్వారా సురేశ్ రైనా (23 ఏళ్ల 156 రోజులు)ను వెనక్కి నెట్టాడు. అంతర్జాతీయ టీ20లో గిల్‌కి ఇదే తొలి సెంచరీ. భారత్ తరఫున ఈ ఫార్మాట్‌లో సెంచరీ చేసిన ఏడో ఆటగాడిగా గిల్ నిలిచాడు వన్డేల్లో డబుల్ సెంచరీ, టీ20ల్లో సెంచరీ సాధించిన రెండో ప్లేయర్ గా చరిత్రకెక్కాడు