టీ20ల్లో అరుదైన మైలురాయిని చేరుకున్న రీజా హెండ్రిక్స్
టీ20ల్లో దక్షిణాఫ్రికా బ్యాటర్ రీజా హెండ్రిక్స్ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. వెస్టిండీస్ తో జరిగిన మూడో టీ20ల్లో ఆ ఫీట్ ను అధిగమించాడు. ఈ మ్యాచ్ లో రీజా హెండ్రిక్స్ 44 బంతుల్లో 83 పరుగులతో అద్భుతంగా రాణించాడు. దీంతో టీ20ల్లో 1500 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. చివరి టీ20ల్లో క్వింటాన్ డికాక్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన హెండ్రిక్స్, రిలీ రోసౌవ్ కలిసి రెండో వికెట్ కు 80 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యాన్ని జోడించారు. అనంతరం అల్జారీ జోసెఫ్, హెండ్రిక్స్ ను ఔట్ చేశాడు. ఇప్పటివరకూ 51 టీ20లు మ్యాచ్ లు ఆడి 1544 పరుగులు చేశాడు. ఇందులో 13 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
సౌతాఫ్రికా గడ్డపై టీ20 సిరీస్ గెలిచిన వెస్టిండీస్
టీ20ల్లో దక్షిణాఫ్రికా తరుపున 1,500 పరుగులు పూర్తి చేసిన ఐదో బ్యాటర్ గా హెండ్రిక్స్ నిలిచాడు. వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో హెండ్రిక్స్ వరుసగా 21, 68, 83 పరుగులు చేశాడు. వెస్టిండీస్ ఆడిన 10 మ్యాచ్‌ల్లో హెండ్రిక్స్ 34.30 సగటుతో 343 పరుగులు చేసి, రెండు అర్ధ సెంచరీలను బాదాడు. మొదట బ్యాటింగ్ చేసిన కరేబియన్లు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ నష్టానికి 220 పరుగులు చేశారు. లక్ష్య చేధనకు సౌతాఫ్రికా నిర్ణత 20 ఓవర్లలో 213 పరుగులు చేసి, ఏడు పరుగుల తేడాతో ఓడిపోయింది. సుమారు 8 ఏళ్ల తర్వాత సౌతాఫ్రికా గడ్డపై విండీస్ జట్టు టీ20 సిరీస్‌ను గెలుచుకుంది.