LOADING...
Rishabh Pant-Virat Kohli: విరాట్‌ కోహ్లీ జెర్సీతో మైదానంలోకి  రిషభ్‌ పంత్‌  .. నెట్టింట వైరల్‌!
విరాట్‌ కోహ్లీ జెర్సీతో మైదానంలోకి రిషభ్‌ పంత్‌ .. నెట్టింట వైరల్‌!

Rishabh Pant-Virat Kohli: విరాట్‌ కోహ్లీ జెర్సీతో మైదానంలోకి  రిషభ్‌ పంత్‌  .. నెట్టింట వైరల్‌!

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 30, 2025
03:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

సుదీర్ఘ విరామం తరువాత మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టిన రిషబ్ పంత్‌ (Rishabh Pant) ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో గాయం కారణంగా దాదాపు మూడు నెలల పాటు ఆటకు దూరంగా ఉన్న అతడు, తాజాగా దక్షిణాఫ్రికా 'A' జట్టుతో జరుగుతున్న అనధికారిక టెస్టు సిరీస్‌లో భారత్ 'A' జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మైదానంలో మొదటి మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన పంత్ బౌలింగ్ ఎంచుకోవడంతో మ్యాచ్ ఆరంభమైంది. అయితే, అతడు ధరించిన జెర్సీ నంబర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

వివరాలు 

కోహ్లీకి గౌరవ సూచకంగా ఆ నంబర్ ఎంచుకున్నాడా?

సాధారణంగా 17వ నంబర్ జెర్సీ వేసుకునే రిషభ్ పంత్ ఈసారి 18వ నంబర్ జెర్సీలో మైదానంలో కనిపించాడు. ఈ సంఖ్య చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే,అది ఒకప్పుడు స్టార్‌ ఆటగాడు,మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ జెర్సీ నంబర్‌ కావడమే విశేషం టెస్టు ఫార్మాట్‌కు కోహ్లీ ఇప్పటికే వీడ్కోలు పలికాడు. కాబట్టి, పంత్ ఆ నంబర్ జెర్సీని ధరించడం చర్చనీయాంశంగా మారింది. ఇది పొరపాటున జరిగినదా?లేక కావాలనే కోహ్లీకి గౌరవ సూచకంగా ఆ నంబర్ ఎంచుకున్నాడా? అనే అనుమానాలు అభిమానుల్లో మొదలయ్యాయి. గతంలో ముకేశ్ కుమార్ కూడా (తన జెర్సీ నంబర్ 49 అయినా)ఇంగ్లాండ్ పర్యటనకు ముందు 'A' జట్టు తరఫున ఆడినప్పుడు 18 నంబర్ జెర్సీనే వేసుకున్న విషయం గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు.

వివరాలు 

ఫ్యాన్స్ విజ్ఞప్తి మరోలా.. 

సచిన్ టెండూల్కర్‌ (10),ఎంఎస్ ధోని (7) ఆటకు వీడ్కోలు పలికిన తరువాత, బీసీసీఐ ఆ నంబర్ల జెర్సీలను ఇక ఎవరూ ఉపయోగించరాదని నిర్ణయించింది. కానీ విరాట్ కోహ్లీ విషయానికి వస్తే, ఆయన ఇంకా వన్డేల్లో కొనసాగుతున్నందున 18వ నంబర్‌ రిటైర్ చేయలేదు. అందుకే టెస్టు ఫార్మాట్‌లో ఆ నంబర్ జెర్సీ అందుబాటులో ఉండటంతో రిషభ్ పంత్ దాన్ని ఎంచుకున్నాడని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.

వివరాలు 

జోర్డాన్, హమ్జా హాఫ్ సెంచరీలు 

భవిష్యత్తులో కోహ్లీ, రోహిత్ శర్మ (జెర్సీ నంబర్ 45) వన్డేలకు కూడా రిటైర్ అయితే, ఆ నంబర్లను బీసీసీఐ శాశ్వతంగా రిటైర్ చేసే అవకాశముందని అంచనాలు ఉన్నాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్ మొదలుపెట్టిన దక్షిణాఫ్రికా 'A' జట్టు తొలి వికెట్ త్వరగా కోల్పోయినా, తర్వాతి బ్యాటర్లు జోర్డాన్, హమ్జా హాఫ్ సెంచరీలు సాధించారు. భారత 'A' బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొంటూ ఆ జట్టు బలమైన స్థితిలో కొనసాగుతోంది.