IND vs NZ: టెస్టు క్రికెట్‌లో రిషబ్ పంత్ సరికొత్త రికార్డు
ముంబైలో జరుగుతున్న ఇండియా-న్యూజిలాండ్ మూడో టెస్టు మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ రికార్డును రిషబ్ పంత్ అధిగమించాడు. శుక్రవారం వాంఖడే స్టేడియంలో ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేయగా, తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌటైంది. భారత్ బ్యాటింగ్ ప్రారంభించిన తర్వాత, మొదటి రోజు ముగిసే సమయానికి 86 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. రెండో రోజున, రిషబ్ పంత్ (60), శుభ్ మన్ గిల్ (90) పరుగులు చేయడంతో, భారత్ జట్టు 263 పరుగులు చేసిన తర్వాత కివీస్ పై 28 పరుగుల ఆధిక్యాన్ని పొందింది.
36 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
పంత్ తన దూకుడైన బ్యాటింగ్‌తో 36 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఇందులో 7 బౌండరీలు, 2 సిక్సులున్నాయి. ఈ మ్యాచులో న్యూజిలాండ్‌పై భారతీయ బ్యాటర్లలో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డును నెలకొల్పాడు. ఇంతకు ముందు, యశస్వి జైస్వాల్ పుణేలో జరిగిన మ్యాచ్‌లో 41 బంతుల్లో హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. పంత్ గతంలో 2022లో బెంగళూరులో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 28 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేసిన సంగతి తెలిసిందే.