IND vs AUS: టీమిండియాలో 'బెస్ట్ స్లెడ్జర్' రిషభ్ పంత్.. ఆసీస్ క్రికెటర్లు
క్రికెట్‌లో ఆటగాళ్ల మధ్య తరుచూ మాటల యుద్ధం జరుగుతుంది. కానీ కొన్నిసార్లు ఈ మాటల యుద్ధం అత్యంత ఉత్సాహభరిత స్థాయికి చేరుతుంది. ముఖ్యంగా ప్రతిష్ఠాత్మక టోర్నీలలో జట్ల మధ్య తీవ్ర పోటీ ఉంటుంది. ప్రత్యర్థి ఆటగాళ్లను కవ్వించి, వారి ఏకాగ్రతను భంగం చేసేందుకు స్లెడ్జింగ్ చేస్తుంటారు. ముఖ్యంగా బ్యాటర్లను టార్గెట్ చేస్తూ ఇలా మాటలతో ఆటపట్టించడం సహజం. బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య స్లెడ్జింగ్ తరచుగా కనిపిస్తుంది. తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్లు ట్రావిస్ హెడ్, లబుషేన్, ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్, పాట్ కమిన్స్, హేజిల్‌వుడ్ 'బెస్ట్ స్లెడ్జర్'గా టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను పేర్కొన్నారు.
రిషబ్ పంత్ ఫన్నీగా స్లెడ్జింగ్ చేస్తాడు
పంత్ చాలా ఫన్నీగా స్లెడ్జింగ్ చేస్తాడని, అతను చెప్పేది అర్థం కాకపోయినా సరదాగా ఉంటుందని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను స్టార్ స్పోర్ట్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పంత్ మాట్లాడుతూ తాను ఎప్పుడూ ప్రత్యేక ఉద్దేశంతో స్లెడ్జింగ్ చేయనని, సరదా కోసం మాత్రమే చేస్తానని చెప్పాడు.