LOADING...
WTC: డబ్ల్యూటీసీ ఫైనల్‌ బెర్త్‌ కోసం రోహిత్‌ సేనకు చివరి అవకాశం!
డబ్ల్యూటీసీ ఫైనల్‌ బెర్త్‌ కోసం రోహిత్‌ సేనకు చివరి అవకాశం!

WTC: డబ్ల్యూటీసీ ఫైనల్‌ బెర్త్‌ కోసం రోహిత్‌ సేనకు చివరి అవకాశం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 30, 2024
02:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు మరోసారి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో ఆసీస్ చేతిలో భారత్ 184 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ ఓటమితో ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 1-2తో వెనుకబడింది. ప్రధానంగా బ్యాటింగ్ వైఫల్యమే ఈ ఓటమికి కారణమైంది. 340 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, ఆసీస్ బౌలర్ల అద్భుత ప్రదర్శనతో కేవలం 155 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో యశస్వి జైశ్వాల్‌, నితీశ్ కుమార్‌, వాషింగ్టన్ సుందర్ తప్ప మిగతా బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. రెండు ఇన్నింగ్స్‌లలోనూ జైశ్వాల్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

Details

ఫైనల్ బెర్తు ఖరారు చేసుకున్న దక్షిణాఫ్రికా

బౌలింగ్ విభాగంలో ఆసీస్ ఆటగాళ్లు స్కాట్ బోలాండ్‌, ప్యాట్ కమ్మిన్స్ తలా మూడు వికెట్లు పడగొట్టగా, స్టార్క్, ట్రావిస్ హెడ్ చెరో వికెట్ సాధించారు. ఈ పరాజయంతో భారత్‌ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుకునే అవకాశాలు మరింత కష్టతరమయ్యాయి. డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్‌లో దక్షిణాఫ్రికా ఇప్పటికే ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. మరో బెర్త్ కోసం ఆసీస్, భారత్ మధ్య పోటీ కొనసాగుతోంది. మెల్‌బోర్న్ టెస్టు ఓటమితో భారత్‌ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు మరింత సంక్లిష్టమయ్యాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ మూడో స్థానంలో ఉంది. ఈ ఓటమితో భారత విన్నింగ్ శాతం 55.89 నుంచి 52.77కు పడిపోయింది. మరోవైపు, ఈ విజయంతో ఆసీస్ తమ విన్నింగ్ శాతం 58.89 నుంచి 61.46కి పెంచుకుంది.

Details

సిడ్నీ టెస్టులో గెలవాలి

దీంతో ఫైనల్‌కు భారత్ చేరడం కాస్త క్లిష్టతరమైంది. ప్రస్తుత సైకిల్‌లో భారత్‌కు ఇంకా ఒక్క టెస్టు మాత్రమే మిగిలి ఉంది. అయితే ఆసీస్ మూడు మ్యాచ్‌లు ఆడనుంది. అందులో ఒకటి భారత్‌తో, మిగతా రెండు శ్రీలంకతో జరగనున్నాయి. అయితే, భారత డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు పూర్తిగా ముగిసిపోలేదు. సిడ్నీ వేదికగా జరగనున్న ఆఖరి టెస్టులో భారత్ తప్పనిసరిగా విజయం సాధించాల్సి ఉంది. అదే సమయంలో శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆసీస్ కనీసం ఒక మ్యాచ్‌లో ఓడిపోవాలి. లేదా ఆ సిరీస్ 0-0తో డ్రాగా ముగిసినా, భారత్‌ ఫైనల్‌కు చేరే అవకాశముంటుంది. ఈ పరిస్థితుల్లో సిడ్నీ టెస్టు భారత్‌కు కీలకంగా మారింది.