రోహిత్ శర్మ బర్తడే స్పెషల్: రికార్డుల రారాజు హిట్ మ్యాన్
అతనో ఓ సంచలనం, అతని బ్యాటింగ్ ఓ అద్భుతం, అతను ఒకసారి సిక్సర్లు కొట్టడం మొదలు పెట్టాడంటే ఎలాంటి బౌలర్ అయినా సరే ప్రేక్షకుడిలా మారిపోవాల్సిందే. భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకొని ఓపెనర్ గా భారత్ కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన మేటి బ్యాటర్, అభిమానులకు అతను ఒక హిట్ మ్యాన్, కొంచెం అగ్రెసివ్, కొంచెం కూల్ కెప్టెన్సీ మనోడి నైజం, ఓ సాధారణ ఆటగాడిగా జట్టులోకి వచ్చి టీమిండియా మూడు ఫార్మెట్లకు కెప్టెన్ అయి అద్భుత రికార్డులను సాధించాడు రోహిత్ శర్మ. నేడు రోహిత్ పుట్టిన రోజు సందర్భంగా అతని రికార్డులపై ఓ లుక్కేద్దాం
వన్డేలో మూడు డబుల్ సెంచరీలు
2007లో టీమిండియా తరుపున ఆరంగ్రేటం చేసిన రోహిత్ మొదట్లో పెద్దగా రాణించలేదు. 2015లో మొదటిసారిగా దక్షిణాఫ్రికాపై టీ20ల్లో సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక 2013లో రోహిత్ ఓపెనర్ గా మారి ఎన్నో రికార్డులను సృష్టించాడు. వన్డే క్రికెట్లో సెంచరీలు చేయడానికి బ్యాటర్లు నానా కష్టాలు పడుతున్నారు. అలాంటిది వన్డేల్లో మూడుడబుల్ సెంచరీలు చేసిన ఆటగాడిగా రోహిత్ రికార్డుకెక్కాడు. ఆస్ట్రేలియాతో 2013లో మొదటి డబుల్ సెంచరీ చేసి, అ ఏడాదే శ్రీలంకపై ఏకంగా 264 పరుగులు చేశాడు. మరోసారి 2017లో ద్విశతకాన్ని బాదాడు. ఆరు వన్డే వరల్డ్ కప్ లు ఆడిన సచిన్ ఆరు సెంచరీలు సాధిస్తే.. రోహిత్ రెండు వరల్డ్ కప్ లు ఆడి ఐదు సెంచరీలు సాధించడం విశేషం.
ఐపీఎల్ లో హ్యాట్రిక్ వికెట్లు తీసిన హిట్ మ్యాన్
ఐపీఎల్లో మొదటి సారిగా డెక్కన్ ఛార్జర్స్ తరుపున హిట్ మ్యాన్ ఆడాడు. ఆ జట్టు తరుపున హ్యాట్రిక్ వికెట్లు తీసిన బౌలర్ గా రోహిత్ నిలిచాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ఆ జట్టుకు ఐదు టైటిల్స్ అందించాడు. ఇప్పటివరకూ 243 వన్డేల్లో 9815 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 48 అర్ధసెంచరీలు, 3 డబుల్ సెంచరీలున్నాయి. 148 అంతర్జాతీయ టీ20ల్లో 3853 పరుగులు చేసి, నాలుగు సెంచరీలు చేశాడు. ఇక 49 టెస్టులు ఆడి 3379 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 14 అర్ధ సెంచరీలను బాదాడు. ఐపీఎల్ 234 మ్యాచ్ లు ఆడి 6060 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 41 అర్ధ సెంచరీలను బాదాడు.