Rohit Sharma: అంతర్జాతీయ పరుగుల మైలురాయికి అడుగు దూరంలో రోహిత్ శర్మ.. మరో 41 పరుగులు చేస్తే..
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ అరుదైన మైలురాయికి అడుగు దూరంలో ఉన్నారు. అతడు మరో 41 పరుగులు చేస్తే.. అంతర్జాతీయ క్రికెట్‌లో 20,000 పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో భారతీయ బ్యాటర్‌గా రోహిత్ నిలవనున్నారు. ప్రస్తుతం సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రావిడ్ ఈ క్లబ్‌లో ఉన్నారు.
వివరాలు
టీ20, టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్
సచిన్ 34,357 పరుగులతో టాప్‌లో ఉన్నారు. విరాట్ కోహ్లీ 27,808 రన్స్‌తో రెండవ స్థానంలో ఉండగా, రాహుల్ ద్రవిడ్ 24,064 పరుగులతో మూడో స్థానంలో ఉన్నారు. రోహిత్ శర్మ ప్రస్తుతం 19,959 పరుగులు చేసి, 503 మ్యాచుల్లో 42.46 సగటుతో ఈ పరుగులను రాబట్టారు. అంతర్జాతీయ కెరీర్‌లో అతను ఇప్పటివరకు 110 హాఫ్ సెంచరీలు, 50 సెంచరీలు పూర్తి చేసారు. టెస్టుల్లో 4,301, టీ20ల్లో 4,231, వన్డేల్లో 11,427 పరుగులు చేసి తన ప్రతిభను చాటుకున్నారు. హిట్‌మ్యాన్ ఇప్పటికే టీ20, టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు, కాబట్టి ప్రస్తుతం కేవలం వన్డే క్రికెట్‌లోనే కొనసాగుతున్నారు.
వివరాలు
రోహిత్ వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు
ఇటీవల ముగిసిన రాంచీ వన్డేలో రోహిత్ 51 బంతుల్లో 57 పరుగులు చేశారు. విరాట్ కోహ్లీతో కలిసి రెండో వికెట్‌కు భారీ భాగస్వామ్యం ఏర్పరిచారు. అలాగే, ఈ మ్యాచ్‌లో రోహిత్ వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్‌గా (352) రికార్డు నమోదు చేశారు. పాకిస్థాన్ మాజీ బ్యాటర్ షాహిద్ అఫ్రిదీ 351 సిక్స్‌లతో పైనే ఉన్న రికార్డును రోహిత్ వెనక్కి నెట్టి కొత్త రికార్డు నెలకొల్పారు. మరికొన్ని గంటల్లో రాయ్‌పుర్ వేదికలో ప్రారంభం కానున్న రెండో వన్డేలోనూ రోహిత్ శర్మ రాణించి, 20,000 పరుగుల మైలురాయిని సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు.