ఆసియా కప్ కూర్పుపై రోహిత్ కీలక వ్యాఖ్యలు.. ఆ పాగల్ పని చేయబోమని స్పష్టం
టీమిండియా ఆసియా కప్ జట్టుపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. మిడిలార్డర్ ఆటగాళ్లు ఏ స్థానంలోనైనా అనువుగా కుదురుకోవాలని రోహిత్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మీకు అర్థమయ్యే రీతిలో చెబుతాను, ఫ్లెక్సిబిలిటీ అంటే ఓపెనర్ ను ఏడో స్థానంలో పంపించడం, కాదంటే హార్దిక్ పాండ్యాతో ఓపెనింగ్ చేయించడం కాదన్నారు. గత నాలుగు ఐదేళ్లుగా కోహ్లి మూడోస్థానంలోనే వస్తున్నాడని, అటు 4, 5 స్థానాల్లోకి వచ్చే ఆటగాళ్లు అనువుగా ఉండాలని రోహిత్ పేర్కొన్నారు. తాను అదే చేశానని వివరించారు. ఓపెనర్ బ్యాట్స్ మెన్ ను దిగువకు పంపించడం ఉండదని స్పష్టం చేశాడు.అది పిచ్చితనం (పాగల్ పని). అలాంటి పనిని తాము చేయబోమన్నారు. ఇక నాలుగో స్థానంలో ఎవరూ నిలదొక్కుకోకపోవడంపై రోహిత్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
నేను అదే చేశాను : రోహిత్ శర్మ
నాలుగోస్థానంలో ఆడే ఆటగాళ్లు తమ దగ్గర ఉన్నారని రోహిత్ చెప్పుకొచ్చారు. అయితే తమకు మరి కొన్ని సవాళ్లు ఎదురయ్యాయన్నారు. అవి ఆటగాళ్లు ఒత్తిడికి గురవడం, దురదృష్టవశాత్తు గాయాల కారణంగా వేరే ఆటగాళ్లను ప్రయోగించాల్సి రావడం లాంటివి జరిగాయన్నారు. మరోవైపు ప్రపంచకప్ పైనా రోహిత్ స్పందించారు. అండర్ డాగ్స్,ఫేవరెట్స్ ట్యాగ్స్ పై తమకు నమ్మకం లేదన్నారు. గెలవాలంటే అందరూ బాగా ఆడాల్సిందేనని కుండబద్దలు కొట్టారు. ఓవైపు స్వదేశంలో ఆడటం సానుకూలమే అయినా ఇటీవలే చాలా మంది విదేశీయులు భారతదేశంలో ఎక్కువగా క్రికెట్ ఆడుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రస్తుతం శ్రేయస్ పూర్తి ఫిట్ నెస్ సాధించాడని, రాహుల్ పై స్పష్టత లేకపోవడంతోనే స్టాండ్‌బైగా సంజూను ఎంపిక చేశామని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ అన్నారు.