రెండో బౌలర్‌గా బుమ్రా ప్రపంచ రికార్డు.. టీమిండియాకు గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన యార్కర్ కింగ్
టీమిండియా ప్రధాన పేసర్, టీమ్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అదరగొట్టాడు. 11 నెలల సుదీర్ఘ విరామం తర్వాత పూర్తి ఫిట్‌నెస్ సాధించి జట్టులోకి పునరాగమనం చేశాడు. ఐర్లాండ్‌పై జరిగిన తొలి టీ20లోనే అద్భుతం చేశాడు.మ్యాచ్ లో రెండు వికెట్లు తీసి మరోసారి తన బౌలింగ్ పవర్ ను రుచి చూపించాడు. ఏడాది తర్వాత గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన ఈ ఫేసర్ ఐర్లాండ్ తో ఆడిన రెండు టీ20 మ్యాచ్‌ల్లో 4 వికెట్లు సాధించాడు.తొలి మ్యాచ్‌లోనే 2 వికెట్లు పడగొట్టిన బుమ్రా, రెండో మ్యాచ్‌లోనూ 2 వికెట్లు కూల్చడం విశేషం. మరోవైపు రెండో టీ20లో 4 ఓవర్ల కోటాలో మెయిడిన్ ఓవర్ వేసిన ఈ స్టార్ బౌలర్, కేవలం 15 రన్స్ మాత్రమే ఇచ్చాడు.
అత్యధిక మెయిడిన్ ఓవర్‌లు వేసిన రెండో బౌలర్‌గా బుమ్రా
రెండో టీ20లో ఇన్నింగ్స్ చివరిది, 20వ ఓవర్లో మెయిడిన్ ఓవర్ వేయడం యార్కర్ కింగ్ బౌలింగ్ లో నాణ్యతను సూచిస్తోంది.ఈ నేపథ్యంలోనే స్టార్ పేసర్ అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నాడు. టీ20 చరిత్రలో అత్యధిక మెయిడిన్ ఓవర్‌లు (10) వేసిన రెండో బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఇదే జాబితాలో ఉగాండా బౌలర్ ఫ్రాంక్ న్సుబుగా 15 మెయిడిన్ ఓవర్లతో టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. మరోవైపు 3, 4 స్థానాల్లో భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ (10), జర్మనీ బౌలర్ గులాం అహ్మదీ (10)లు ఉండటం గమనార్హం. అనంతరం 8 మంది 6 మెయిడిన్ ఓవర్‌లు వేశారు. టీ20ల్లో టీమిండియా తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో పాండ్యా,అశ్విన్‌లను యార్కర్ కింగ్ బుమ్రా అధిగమించాడు.
వెన్నునొప్పి కారణంగా జట్టుకు దూరమైన బుమ్రా
96 వికెట్లు తీసిన చహల్ అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్నాడు. 87 మ్యాచుల్లో 90 వికెట్లు పడగొట్టిన భువనేశ్వర్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. 62 మ్యాచ్‌ల్లో 74 వికెట్లు పడగొట్టిన బుమ్రా మూడో స్థానంలో ఉన్నాడు. 92 మ్యాచ్‌లు ఆడి 73 వికెట్లు పడగొట్టిన పాండ్యా, 65 మ్యాచ్‌ల్లో 72 వికెట్లు కూల్చిన అశ్విన్ వరుసగా ఉన్నారు. 2022 సెప్టెంబర్ లో బుమ్రా జట్టు నుంచి తప్పుకున్నాడు. దీంతో టీ20-ప్రపంచకప్ 2022, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ, IPL, WTC FINAL- 2023, వెస్టిండీస్ పర్యటనలో అందుబాటులో లేకుండా పోయాడు. ఈ ఏడాది ఆరంభంలో వెన్నునొప్పికి శస్త్రచికిత్స చేయించుకున్న బుమ్రా, తర్వాత జాతీయ అకాడమీలో శిక్షణ పూర్తి చేసి ఫిట్‌నెస్ సాధించాడు.