Page Loader
Sachin Tendulkar: లార్డ్స్ మ్యూజియంలో సచిన్ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం!
లార్డ్స్ మ్యూజియంలో సచిన్ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం!

Sachin Tendulkar: లార్డ్స్ మ్యూజియంలో సచిన్ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 10, 2025
05:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

లార్డ్స్ మైదానంలోని ప్రసిద్ధ ఎంసీసీ మ్యూజియంలో భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ చిత్రపటాన్ని ఇవాళ ఆవిష్కరించారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌-భారత్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు సందర్భంగా ఈ ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ చిత్రపటాన్ని ప్రముఖ చిత్రకారుడు స్టువర్ట్ పియర్సన్ రైట్ ఆయిల్ పేయింటింగ్ ద్వారా వేశాడు. ఈ చిత్రం కోసం ఆయన 18 ఏళ్ల క్రితం తీసిన ఓ ఫోటోను ఆధారంగా తీసుకున్నారు. ఈ ఏడాది చివరి వరకు సచిన్ చిత్రపటం ఎంసీసీ మ్యూజియంలో ప్రదర్శనలో ఉంటుంది. అనంతరం దీనిని పెవిలియన్‌ గ్యాలరీకి మార్చనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. గతంలో కూడా పియర్సన్ భారత క్రికెట్ దిగ్గజులు కపిల్ దేవ్, బిషన్ సింగ్ బేడీ, దిలీప్ వెంగ్‌సర్కర్ చిత్రపటాలను రూపొందించారు.

Details

లార్డ్స్‌లో నా చిత్రపటం ఉంటుందంటే గర్వంగా ఉంది : సచిన్

ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ లార్డ్స్‌ మైదానంలో నా చిత్రపటం ప్రదర్శించబడటం ఎంతో గౌరవంగా ఉందని హర్షం వ్యక్తం చేశాడు. 1983లో భారత్ వన్డే వరల్డ్‌కప్‌ను గెలుచుకున్న సమయంలో తొలిసారిగా లార్డ్స్ స్టేడియాన్ని చూసిన అనుభూతిని గుర్తుచేసుకున్న సచిన్, ఆ క్షణాలు నా కళ్లముందు తిరుగుతున్నాయి. ఇప్పుడు నా చిత్రపటం అక్కడ ఉండడం నా క్రికెట్ ప్రయాణాన్ని మళ్లీ గుర్తుకు తెస్తోందని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఎంసీసీ మ్యూజియంలో మూడువేల ఫోటోలున్నాయని, అందులో 300 వరకు పోట్రేట్లు మాత్రమే ఉండటం గమనార్హం. సచిన్ టెండూల్కర్ పోట్రేట్ కూడా అందులో ఒకటిగా నిలవడం విశేషం. ఈ అభిమానం, గౌరవం ప్రపంచ క్రికెట్‌లో సచిన్ గొప్పతనాన్ని మరోసారి చాటిచెప్పింది.