Sri Lanka Coach: శ్రీలంక హెడ్‌కోచ్‌గా సనత్ జయసూర్య నియామకం.. అధికారికంగా ప్రకటించిన శ్రీలంక క్రికెట్ బోర్డు
ప్రముఖ క్రికెటర్లు ఆటకు వీడ్కోలు పలకడంతో గత కొన్నేళ్లుగా నిరాశజనకమైన ప్రదర్శన చూపిస్తున్న శ్రీలంక క్రికెట్ జట్టు ఇటీవల మెరుగైన ప్రదర్శనను ఇస్తోంది. పూర్వ వైభవం తిరిగి రావడం కష్టమే అనే దశలో ఉండగా, జట్టు మళ్లీ వరుస విజయాలను సాధిస్తోంది. ఈ విజయాలకు ప్రధాన కారణంగా శ్రీలంక క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్య గుర్తించారు. జట్టుకు తాత్కాలిక కోచ్‌గా నియమితుడైన జయసూర్య, జట్టును విజయపథంలో నడిపించారు. ఈ నేపథ్యంలో, శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకొని జయసూర్యను ప్రధాన కోచ్‌గా ప్రమోట్ చేసింది. ఈ నిర్ణయం ద్వారా జట్టులో ఉత్సాహాన్ని నింపి, ముఖ్యమైన సిరీస్‌లను గెలుచుకునేందుకు జయసూర్య సహాయపడుతారని వారు భావిస్తున్నారు.
న్యూజిలాండ్ టెస్టు సిరీస్ 2-0తో క్లీన్ స్వీప్
2024లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో ఘోర వైఫల్యం తర్వాత శ్రీలంక హెడ్ కోచ్ సిల్వర్ వుడ్ తన బాధ్యతల నుండి తప్పుకున్నాడు. ఆ తరువాత జయసూర్య తాత్కాలిక కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నారు. భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో శ్రీలంక 2-0తో విజయం సాధించింది, ఇది 27 సంవత్సరాల తర్వాత భారత్‌తో వన్డే సిరీస్‌ను గెలుచుకోవడాన్ని సూచిస్తుంది. ఈ సిరీస్ తర్వాత ఇంగ్లాండ్‌తో లండన్‌లో జరిగిన టెస్టు మ్యాచులో కూడా శ్రీలంక విజయం సాధించింది. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేశారు. ఈ విజయాల నేపథ్యంలో, జయసూర్యను శ్రీలంక క్రికెట్ బోర్డు పూర్తి స్థాయి కోచ్‌గా నియమించింది, అతను 2026 మార్చి 31 వరకు ఈ పదవిలో కొనసాగనున్నాడు.
భారత్, ఇంగ్లండ్, న్యూజిలాండ్‌తో సిరీస్‌లలో సనత్ జయసూర్య తాత్కాలిక కోచ్
"ఇటీవల భారత్, ఇంగ్లండ్, న్యూజిలాండ్‌తో సిరీస్‌లలో సనత్ జయసూర్య తాత్కాలిక కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. జట్టును విజయవంతంగా ముందుకు నడిపించారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని, శ్రీలంక క్రికెట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆయన్ను పూర్తి స్థాయి ప్రధాన కోచ్‌గా నియమించేందుకు నిర్ణయం తీసుకుంది" అని శ్రీలంక క్రికెట్ బోర్డు తెలిపింది.
బౌలింగ్‌లో కూడా రికార్డులు
ప్రపంచ క్రికెట్‌లో జయసూర్య ఎన్నో రికార్డులు నెలకొల్పారు. 1989 నుండి 2011 వరకు శ్రీలంక తరపున 110 టెస్టులు, 445 వన్డేలు, 31 టీ20 మ్యాచ్‌లు ఆడారు. టెస్టుల్లో 40.07 సగటుతో 6973 పరుగులు, వన్డేల్లో 36.75 సగటుతో 13,430 పరుగులు, టీ20ల్లో 629 పరుగులు సాధించారు. బౌలింగ్‌లో కూడా అతడు అదరగొట్టాడు. టెస్టుల్లో 98 వికెట్లు, వన్డేల్లో 323, టీ20ల్లో 19 వికెట్లు సాధించారు. మరి హెడ్ కోచ్‌గా ఎలాంటి ఫలితాలు రాబడతాడో తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.