Loading...
David Warner: శాండ్‌పేపర్ గేట్ వివాదం.. కమిన్స్‌పై మరోసారి వార్నర్ ఫైర్!
శాండ్‌పేపర్ గేట్ వివాదం.. కమిన్స్‌పై మరోసారి వార్నర్ ఫైర్!

David Warner: శాండ్‌పేపర్ గేట్ వివాదం.. కమిన్స్‌పై మరోసారి వార్నర్ ఫైర్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 14, 2026
12:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎనిమిదేళ్ల క్రితం దక్షిణాఫ్రికా గడ్డపై చోటుచేసుకున్న 'శాండ్‌పేపర్ గేట్' వివాదం ఇప్పుడు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో మరోసారి కలకలం రేపుతోంది. మాజీ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా తన ఆత్మకథలో ఈ ఘటనపై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలతో పాత వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఖవాజా వ్యాఖ్యలకు డేవిడ్ వార్నర్ మద్దతు పలకగా.. ప్రస్తుత కెప్టెన్ పాట్ కమిన్స్ మాత్రం వాటిని పచ్చి అబద్ధాలంటూ కొట్టిపారేశాడు. ఈ క్రమంలో కమిన్స్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన వార్నర్.. తాజాగా మరోసారి సోషల్ మీడియా వేదికగా 'శాండ్‌పేపర్ గేట్' వివాదంపై స్పందించాడు.

వివరాలు

కమిన్స్‌పై వార్నర్ తీవ్ర విమర్శలు

ఈసారి మరో ముగ్గురు బౌలర్ల పేర్లను ప్రస్తావిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా విచారణ తీరును ప్రశ్నించాడు. నాకు తెలిసినంతవరకు.. 2018లో జరిగిన విచారణ సందర్భంగా క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, నాథన్ లయన్‌లను ప్రశ్నించలేదు.

ఒకవేళ అదే నిజమైతే.. బౌలర్లకు ఈ విషయం తెలియదనే వాదనను సీఏ ఎలా ముందుకు తీసుకెళ్లగలదు? ఈ వ్యవహారంలో ఎవరిని నిందించాలో ముందే నిర్ణయించుకుని.. ఆ లక్ష్యంతోనే తూతూమంత్రంగా విచారణ జరిపినట్లు కనిపిస్తోంది.

మిగతా బౌలర్లకు ఏమీ తెలియదనే తప్పుడు కథనాన్ని కొనసాగించాలని చూస్తున్నట్లుంది. ఇది కచ్చితంగా వాస్తవాలను కప్పిపుచ్చడమే అవుతుందని వార్నర్ ఘాటుగా పోస్టు చేశాడు.

ADVERTISEMENT