LOADING...
Sanju Samson: చేసింది 11 పరుగులే.. అయినా చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్
చేసింది 11 పరుగులే.. అయినా చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్

Sanju Samson: చేసింది 11 పరుగులే.. అయినా చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 26, 2026
05:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 సీజన్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్, ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఆటగాడు సంజు శాంసన్ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. ఆదివారం చెన్నైలోని ఎం.ఏ. చిదంబరం స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజూ 11 పరుగులు చేశారు. ఈ ఇన్నింగ్స్‌తో ఆయన ఐపీఎల్ కెరీర్‌లో 5000 పరుగుల మైలురాయిని చేరుకుని, ఈ ఘనత సాధించిన 10వ ఆటగాడిగా చరిత్రలో నిలిచారు. ప్రత్యేకత ఏమిటంటే, కేవలం 3555 బంతుల్లోనే ఈ మైలురాయిని చేరుకోవడం ద్వారా సంజూ శాంసన్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 5000 పరుగులు పూర్తి చేసిన భారతీయ బ్యాటర్‌గా అగ్రస్థానంలో నిలిచారు.

వివరాలు

మూడో స్థానంలో సంజు శాంసన్

ఈ క్రమంలో ఆయన సురేష్ రైనా (3620 బంతులు), కేఎల్ రాహుల్ (3688 బంతులు), ఎంఎస్ ధోనీ (3691 బంతులు) వంటి దిగ్గజాల రికార్డులను అధిగమించారు. ఓవరాల్‌గా చూసుకుంటే, అత్యంత వేగంగా 5000 పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో ఏబీ డివిలియర్స్ (3288 బంతులు), డేవిడ్ వార్నర్ (3554 బంతులు) తర్వాత సంజూ శాంసన్ మూడో స్థానంలో నిలవడం విశేషం. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ ఇన్నింగ్స్‌ను ఎంతో జాగ్రత్తగా ప్రారంభించారు. మహమ్మద్ సిరాజ్ వేసిన తొలి ఓవర్‌లో సంయమనంతో ఆడిన ఆయన, తర్వాతి ఓవర్‌లో కాగిసో రబాడా బౌలింగ్‌లో బౌండరీ బాది ఈ 5000 పరుగుల మైలురాయిని చేరుకున్నారు.

వివరాలు

అద్భుత ఫామ్ లో సంజు

ఈ సీజన్‌లో సంజూ అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నారు. కేవలం మూడు రోజుల క్రితమే ముంబై ఇండియన్స్‌పై సెంచరీ చేసి తన దూకుడును చాటారు. రాజస్థాన్ రాయల్స్ తరపున సుదీర్ఘకాలం ఆడిన ఆయన ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరి, పసుపు జెర్సీలోనూ తన విధ్వంసకర బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నారు. స్ట్రైక్ రేట్ పరంగా దిగ్గజాలకు దీటుగా నిలుస్తూ ఈ అరుదైన మైలురాయిని చేరుకోవడం, ఆయన నిలకడ, దూకుడుకు నిదర్శనంగా నిలిచింది.

Advertisement