Sanju Samson: సంజూ శాంసన్ చరిత్ర సృష్టించే అవకాశం.. ప్రపంచంలో తొలి ఆటగాడిగా మారే అవకాశాలు!
భారత్, సౌతాఫ్రికా మధ్య ఇవాళ రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచులో టీమిండియా ఓపెనర్ బ్యాట్స్‌మెన్ సంజు శాంసన్ కొత్త చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో శాంసన్ సెంచరీ సాధిస్తే, టీ20 క్రికెట్ చరిత్రలో హ్యాట్రిక్ సెంచరీలు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా రికార్డులకెక్కుతాడు. ఇంతకు ముందు శాంసన్ సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో, బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో శతకం సాధించాడు. ప్రస్తుతం, టీ20 క్రికెట్ చరిత్రలో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్లు నలుగురు మాత్రమే ఉన్నారు, వీరిలో శాంసన్ కూడా ఒకరు.
అద్భుత ఫామ్ లో శాంసన్
ఫ్రాన్స్‌కు చెందిన గుస్తావ్ మాకెన్, దక్షిణాఫ్రికాకు చెందిన రిలే రోస్సో, ఇంగ్లండ్‌కు చెందిన ఫిల్ సాల్ట్ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు సాధించారు. 2015లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన సంజూ శాంసన్‌కు రెగ్యులర్ అవకాశాలు రాకపోవడంతో జట్టులో స్థానం సంపాదించలేకపోయాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి రెండు టీ20ల్లో పెద్దగా రాణించకపోయినా, చివరి మ్యాచ్‌లో శాంసన్ సెంచరీ సాధించి తన ప్రతిభను చాటుకున్నాడు. ప్రస్తుతం, సౌతాఫ్రికా పర్యటన శాంసన్ కెరీర్‌కు కీలకమైన దశను చాటిచెప్పింది. మొదటి టీ20లో సెంచరీ చేసిన తర్వాత, మిగిలిన మూడు మ్యాచ్‌లలో కనీసం రెండు 50+ స్కోర్లు చేస్తే, అతను ఓపెనింగ్ స్లాట్‌లో తన స్థానాన్ని నిలబెట్టుకొనే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.