LOADING...
Yashasvi Jaiswal: ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. రోహిత్, అఫ్రిది రికార్డుకు చేరువలో యశస్వీ జైస్వాల్!
ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. రోహిత్, అఫ్రిది రికార్డుకు చేరువలో యశస్వీ జైస్వాల్!

Yashasvi Jaiswal: ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. రోహిత్, అఫ్రిది రికార్డుకు చేరువలో యశస్వీ జైస్వాల్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 30, 2025
04:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

జులై 2 నుంచి ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్టు ఆరంభానికి ముందే టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వీ జైస్వాల్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో జైస్వాల్‌ 10 సిక్సర్లు బాదితే, టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌లలో 50 సిక్సర్లు బాదిన ఆటగాడిగా గుర్తింపు పొందనున్నాడు. ప్రస్తుతం ఈ ఘనత పాకిస్థాన్‌ మాజీ ఆటగాడు షాహిద్‌ అఫ్రిది పేరిట ఉంది. అఫ్రిది 46 ఇన్నింగ్స్‌లలో 50 సిక్సర్లు కొట్టి ఈ మైలురాయిని చేరాడు. ఇప్పటివరకు జైస్వాల్‌ 38 ఇన్నింగ్స్‌లలో 40 సిక్సర్లు బాదాడు.

Details

10 సిక్సర్ల దూరంలో జైస్వాల్

రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలో అతడు మరో 10 సిక్సర్లు బాదగలిగితే అఫ్రిది రికార్డును అధిగమించగలడు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో సాధించలేకపోయినా, అతడికి రాబోయే టెస్టులలో సాధించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జైస్వాల్‌ రికార్డు సాధించే అవకాశాలు అత్యంత ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ జాబితాలో భారత్‌ మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్‌ 51 ఇన్నింగ్స్‌లలో 50 సిక్సర్లు బాదగా, న్యూజిలాండ్‌ ఆటగాడు టిమ్‌ సౌథీ 60 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత అందుకున్నాడు.

Details

అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 50 సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితా

షాహిద్ అఫ్రిది (పాకిస్థాన్) - 46 ఇన్నింగ్స్‌లు రోహిత్ శర్మ (భారత్) - 51 ఇన్నింగ్స్‌లు టిమ్ సౌథీ (న్యూజిలాండ్) - 60 ఇన్నింగ్స్‌లు ఆండ్రూ ఫింటాఫ్ (ఇంగ్లాండ్) - 71 ఇన్నింగ్స్‌లు ఆడమ్ గిల్‌క్రిస్ట్ (ఆస్ట్రేలియా) - 74 ఇన్నింగ్స్‌లు మాథ్యూ హెడెన్ (ఆస్ట్రేలియా) - 75 ఇన్నింగ్స్‌లు

Details

బర్మింగ్‌హామ్‌ లో చెత్త రికార్డు

ఇక జైస్వాల్‌ టెస్టు కెరీర్ చూస్తే ఇప్పటివరకు 20 టెస్టులు ఆడి, 38 ఇన్నింగ్స్‌లలో 1903 పరుగులు చేశాడు. ఇందులో ఐదు శతకాలు, 10 అర్థ శతకాలు ఉన్నాయి. రెండు వేల పరుగుల మైలురాయికి అతడికి కేవలం 93 పరుగుల దూరం మాత్రమే ఉంది. బర్మింగ్‌హామ్‌ వేదికైన ఎడ్జ్‌బాస్టన్‌ మైదానంలో భారత్‌ ఇప్పటివరకు 8 టెస్టులు ఆడగా, ఏకంగా 7లో పరాజయం పాలైంది. ఒక్క మ్యాచ్‌ను మాత్రమే డ్రా చేసుకున్న టీమ్‌ఇండియా, ఈసారి మాత్రం విజయంపై కన్నేసింది.