
Babar Azam-Mohammad Rizwan: బాబర్ అజామ్-రిజ్వాన్‌లకు వరుస షాక్‌లు.. దిగజారిన 'సెంట్రల్ కాంట్రాక్ట్'.. తిరస్కరించే యోచనలో పాక్ సీనియర్లు!
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ జాతీయ క్రికెట్‌లో ప్రముఖ ఆటగాళ్లు బాబర్ అజామ్,మహ్మద్ రిజ్వాన్‌లకు వరుసగా షాక్ లు తగులుతున్నాయి. తాజాగా ప్రకటించిన ఆసియా కప్ జట్టులో వీరికి చోటు లభించకపోవడమే కాకుండా, సెంట్రల్ కాంట్రాక్ట్ విషయంలోనూ వారికి మరో పెద్ద షాక్ తగిలింది. ఇప్పటివరకు A కేటగిరీలో కొనసాగుతున్నఈ ఇద్దరు ఆటగాళ్లు,తాజా ఒప్పందంలో B కేటగిరీకి దిగజారిపోయారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) 2025 జూలై 1 నుంచి 2026 జూన్ 30 వరకు అమలులో ఉండేలా 30 మంది ఆటగాళ్లకు సెంట్రల్ కాంట్రాక్టులు ప్రకటించింది. అయితే ఆశ్చర్యకరంగా ఎవరికి కూడా A కేటగిరీ ఇవ్వకపోవడం ప్రత్యేక చర్చనీయాంశంగా మారింది. దీంతో తమ స్థాయిని తగ్గించిన విధానంపై బాబర్,రిజ్వాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
వివరాలు
ప్రైవేట్ చాట్‌లో అసహనం
జట్టులో ఎంపిక కాకపోవడం, సెంట్రల్ కాంట్రాక్ట్ దిగజారడంపై రిజ్వాన్, బాబర్ ఇద్దరూ తమ వ్యక్తిగత సంభాషణల్లో ఆవేదన వ్యక్తం చేసినట్లు మీడియా వర్గాలు తెలిపాయి. ఈ ఇద్దరూ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను పూర్తిగా తిరస్కరించే ఆలోచనలో ఉన్నారని వార్తలు వెలువడుతున్నాయి. బోర్డుతో కాంట్రాక్ట్ లేకపోయినా దేశం తరఫున ఆడతామని వీరు నిర్ణయించుకున్నట్లు అక్కడి వర్గాలు వెల్లడించాయి. "పీసీబీ తీర్మానం మాకు కేవలం షాక్ మాత్రమే కాదు, గౌరవాన్ని దెబ్బతీయడం వంటిదే. ఇలాంటి పరిస్థితులు కొనసాగడం అసహనం కలిగిస్తోంది" అని ఇద్దరూ చర్చించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం మహ్మద్ రిజ్వాన్ వన్డే జట్టుకు నాయకత్వం వహిస్తున్నప్పటికీ, అతని కాంట్రాక్ట్ కూడా దిగజారడం గమనార్హం. మరోవైపు, బాబర్ ఆటతీరు పై విమర్శలు ఇంకా తగ్గకపోవడం విశేషం.
వివరాలు
ప్రమోషన్లపై అనుమానాలు
సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో కొందరికి మాత్రమే ఉన్నత స్థాయి ప్రమోషన్ ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఎంపికల వెనుక మాజీ క్రికెటర్ ఆకిబ్ జావెద్, కోచ్ మైక్ హెసెన్ ప్రభావం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం తొమ్మిది టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన ఫహీద్ అష్రాఫ్‌కి కాంట్రాక్ట్ ఇవ్వడం వెనుక ఆకిబ్, మైక్ పాత్ర కీలకమని వర్గాలు చెబుతున్నాయి. ఈ నిర్ణయంపై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. అయితే పీసీబీ మాత్రం ఈ విమర్శలను తోసిపుచ్చింది. "100 శాతం మెరిట్ ఆధారంగానే కాంట్రాక్ట్ కేటాయింపులు జరిగాయి. ఆటగాళ్ల ప్రదర్శనలో మెరుగుదల కనబరచిన వారికే ఉన్నత కేటగిరీ కాంట్రాక్టులు లభించాయి" అని బోర్డు స్పష్టంచేసింది.