
Radhika Yadav: రాధిక హత్యపై రెండో వీడియోలో స్నేహితురాలు చెప్పిన సంచలన వ్యాఖ్యలివే!
ఈ వార్తాకథనం ఏంటి
టెన్నిస్ క్రీడాకారిణి రాధిక యాదవ్ హత్య దేశవ్యాప్తంగా కలకలం రేపింది. కన్న తండ్రే ఆమెను తుపాకీతో కాల్చి చంపడం తీవ్ర దుర్ఘటనగా మారింది. ఈ ఘటన సమయంలో ఇంట్లో రక్తసంబంధులంతా ఉన్నప్పటికీ, ఎవరూ స్పందించకపోవడం షాక్‌కు గురి చేసింది. అనంతరం రాధిక మామ ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లినా, అప్పటికే ఆలస్యమైంది. ఈ విషాద ఘటనకు సంబంధించిన పలు కీలక విషయాలను రాధిక సన్నిహితురాలు, బెస్ట్ ఫ్రెండ్ హిమాన్షిక సింగ్ పుజ్‌పుత్ బయటపెట్టింది. ఆమె సోషల్ మీడియాలో రెండు విడతలుగా వీడియోలు షేర్ చేసింది. మొదటి వీడియోలో రాధిక జీవితంపై తల్లిదండ్రుల విధించిన ఆంక్షలు, నియంత్రణలను వివరించగా, రెండో వీడియోలో రాధిక ఎదుర్కొన్న మానసిక ఒత్తిడిని వివరించింది.
Details
రాధికకు స్వేచ్ఛ లేకుండా పోయింది
హిమాన్షిక మాటల్లో రాధిక ఇంటి వాతావరణం పూర్తిగా శాంతిహీనంగా మారిందని, తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉండేదని తెలిపింది. రాధిక తన తండ్రికి తాను విధించిన నిబంధనల ప్రకారం జీవించేందుకు సిద్ధమని చెప్పినప్పటికీ, ఆయన దారుణ నిర్ణయం తీసుకున్నాడని ఆరోపించింది. తండ్రి దీపక్ యాదవ్‌కు మానసిక స్థైర్యం లేదని, అతడి ముఖంలో ఎలాంటి భావోద్వేగాలు కనిపించవని పేర్కొంది. రాధిక మంచి స్వభావం కలిగిన అమ్మాయి అని ఆమె పేర్కొంది. మొదటి వీడియోలో హిమాన్షిక రాధిక వ్యక్తిగత జీవితంపై దాదాపు నియంత్రణలే ఉండేవని తెలిపింది. రాధిక ఏం చేసినా తల్లిదండ్రులకే చెప్పాల్సివచ్చేదని, ఆమెకు స్వేచ్ఛ అనే విషయం లేదని వాపోయింది. తనకు ఇష్టమైన పనులు ఫొటోలు, వీడియోలు తీయడాన్ని సైతం మానేసిందని చెప్పింది.
Details
హిమాన్షిక ఆరోపణలను ఖండించిన రాధిక కుటుంబం
ఎన్నో ఆంక్షలతో ఆమె జీవితం కఠినంగా మారిందని వివరించింది. అయితే హిమాన్షిక చేసిన ఆరోపణలను రాధిక కుటుంబం ఖండించింది. ఇంట్లో ఆంక్షలు ఉంటే రాధిక బయటకు కూడా వెళ్లలేకపోయేదని, ఆమెకు మంచి భవిష్యత్తు కోసం కుటుంబం చాలా ఖర్చు చేసిందని రాధిక బంధువు తెలిపారు. మీడియా కొన్ని అంశాలను తప్పుగా ప్రచారం చేస్తోందని వారు చెప్పారు. కాగా, రాధిక పెళ్లి విషయమే ఈ హత్యకు దారితీసిన కారణంగా భావిస్తున్నారు. ఇంటి వారు వదిలిన సంబంధాన్ని రాధిక తిరస్కరించి, వేరే కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పినట్లు సమాచారం. ఈ విషయం తండ్రి దీపక్ యాదవ్‌ను తీవ్రంగా కలిచివేసిందని, కుటుంబ పరువు పోతుందన్న కోపంతోనే ఆ దారుణానికి పాల్పడ్డాడని పొరుగింటివారు వెల్లడించారు.