Mohammed Shami: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో గాయపడ్డ షమీ?.. ఫిట్‌నెస్‌పై సందేహాలు!
భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి సుదీర్ఘ ఫార్మాట్‌లో తిరిగి అడుగుపెట్టే ప్రణాళికలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వడంలేదు. దేశవాళీ క్రికెట్‌లో ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవడానికి శ్రమిస్తున్న షమీకి మరోసారి గాయం భారీన పడినట్లు సమాచారం. ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బెంగాల్ తరఫున ఆడుతున్న షమీ, మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయంతో ఇబ్బంది పడినట్లు తెలిసింది. మ్యాచ్ చివరి ఓవర్‌లో 22 పరుగులను కాపాడాల్సిన సమయంలో బౌలింగ్‌కు వచ్చిన షమీ, నడుము కింద భాగంలో నొప్పితో ఇబ్బందికి గురయ్యాడు. మైదానంలోనే కూర్చుండిపోవడంతో బెంగాల్ క్యాంప్‌లో ఆందోళన నెలకొంది. ప్రాథమిక చికిత్స అనంతరం బౌలింగ్‌ను కొనసాగించినా, మునుపటిలా అనుకూలంగా లేదని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.
గతేడాది మోకాలికి శస్త్రచికిత్స
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా జరుగనున్న టెస్టు సిరీస్ కోసం షమీకి టీమిండియా మేనేజ్‌మెంట్ ప్రత్యేకమైన ఫిట్‌నెస్ ప్రమాణాలు నిర్దేశించింది. మూడో టెస్టుకు ముందు ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాలని షరతు విధించింది. అయితే తాజా గాయాలతో ఆ టార్గెట్ సవాలుగా మారింది. గతంలో కూడా షమీ గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యాడు. గతేడాది వన్డే ప్రపంచకప్ తర్వాత మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న షమీ, నెమ్మదిగా కోలుకుంటున్నాడు. మహ్మద్ షమీ జాతీయ జట్టుకు తిరిగి చేరడానికి వందశాతం ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవడం తప్పనిసరి. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీని దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ అతడిని ముందుగానే ఎంపిక చేయడం లేదని తెలుస్తోంది. ఇక ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌కు షమీ అందుబాటులో ఉండడంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.