India vs England Preview: టీమిండియా ఆధిపత్యాన్ని ఇంగ్లాండ్ అడ్డుకుంటుందా?
వన్డే ప్రపంచ కప్-2023లో టీమిండియా మరో ఆసక్తికర సమరానికి సిద్ధమైంది. ఈ టోర్నీలో ఇప్పటికీ ఓటమిని చవిచూడని టీమిండియా.. ఐదు మ్యాచ్‌లో 4ఓడిపోయి పాయింట్ల పట్టికలో కింద నుంచి రెండో స్థానంలో నిలిచిన డిఫెండింగ్ ఛాపింయన్ ఇంగ్లాండ్ ఆదివారం తలపడనున్నాయి. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో దీనికి వేదిక కానుంది. టీమిండియాను ఓడించి తమ విశ్వాసాన్ని పెంచుకోవాలని ఇంగ్లాండ్ భావిస్తోంది. అలాగే ఈ మ్యాచ్‌లోనూ గెలిచి, తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని రోహిత్ సేన ఉవ్విళ్లూరుతోంది.
వన్డేల్లో ఏ జట్టుది మెరుగైన రికార్డు అంటే..
వన్డేల్లో ఇరు జట్ల మధ్య స్వల్ప తేడా మాత్రమే ఉంది. ఇంగ్లాండ్‌పై టీమిండియా స్వల ఆధిక్యంలో ఉంది. ఇరు జట్లు 106 వన్డే మ్యాచ్‌లలో తలపడగా, భారత్ 57 విజయాలు నమోదు చేయగా, ఇంగ్లండ్ 44 సార్లు విజయం సాధించింది. రెండు మ్యాచ్‌లు టై కాగా, మూడు గేమ్‌లలో మాత్రం ఫలితం తేలలేదు. ప్రపంచకప్ టోర్నీల్లో భారత్-ఇంగ్లాండ్ 8 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ మూడు విజయాలను నమోదు చేసింది. ఇంగ్లాంగ్ 4సార్లు గెలిచింది. ఒకటి టైగా నిలిచింది. ఎకానా క్రికెట్ స్టేడియంలో ఒకటే మ్యాచ్ ఆడగా అందులో సౌతాఫ్రికాపై 9 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ఇంగ్లండ్‌పై విరాట్ కోహ్లీ సగటు 43.22
విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. కోహ్లీకి ఇంగ్లాండ్‌పై మంచి రికార్డు ఉంది. ఇంగ్లాండ్‌పై 35 వన్డేల్లో 43.22 సగటుతో 1,340 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, తొమ్మిది అర్ధసెంచరీలు ఉన్నాయి. ఈ ప్రపంచకప్‌లో కోహ్లి ఒక సెంచరీ, మూడు అర్ధసెంచరీలతో 354 పరుగులతో దూకుడు మీద ఉన్నాడు. రోహిత్ శర్మ కూడా మంచి ఫామ్‌లోనే ఉన్నాడు. 2023లో వన్డేల్లో 1,000 పరుగులు పూర్తి చేసేందుకు రోహిత్ శర్మ 31 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో వెయ్యి పరుగులు పూర్తి చేసే అవకాశం ఉంది. శుభ్‌మన్ గిల్ 66.25 సగటుతో 1,325పరుగులతో వన్డేల్లో ఈ ఏడాది అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు. ఈ దశలో గిల్ ఐదు సెంచరీలు చేశాడు.
ఇంగ్లాండ్ బ్యాటర్ల గణాంకాలు ఇలా..
ఈ ఏడాది వన్డేల్లో 811 పరుగులతో డేవిడ్ మలన్ ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. నాలుగు సెంచరీలు బాదిన అతను 62.38 సగటును కలిగి ఉన్నాడు. ఈ ప్రపంచ కప్‌లో 220 పరుగులతో ఇంగ్లాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. జో రూట్ భారత్‌పై 21 వన్డేల్లో 46.18 సగటుతో 739 పరుగులు చేశాడు. భారత్‌పై అతనికి మూడు సెంచరీలు ఉన్నాయి. రూట్ వన్డేల్లో 6,500 పరుగులకు 29 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇదిలా ఉండగా, వన్డేల్లో 5,000 పరుగులను అందుకోవడానికి జోస్ బట్లర్ 82 పరుగులు చేయాల్సి ఉంది.