టెస్టుల్లో స్టీవ్ స్మిత్ ఎవరెస్టు.. అరుదైన మైలురాయిని చేరుకున్న ఆసీస్ బ్యాటర్!
టెస్టు క్రికెట్‌లో ఘనమైన రికార్డులతో పాటు ఇప్పటికే ఆల్‌టైమ్ గ్రేట్ ఆటగాళ్లలో ఒకడిగా నిలిచిన ఆసీస్ స్టార్ స్టీవన్ స్మిత్ మరో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. హెడింగ్లే వేదికగా నేటి నుంచి యాషెస్ మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ఆడడం ద్వారా ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ 100 టెస్టుల మైలురాయిని చేరుకున్నాడు. దీంతో వంద టెస్టులు ఆడిన ఆసీస్ 15వ ప్లేయర్‌గా రికార్డుకెక్కాడు. లార్డ్స్‌లో సెంచరీ సాధించిన స్మిత్, మూడో టెస్టులో కూడా అదే జోరును ప్రదర్శించాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు. 2010లో లార్డ్స్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా అతను టెస్టు అరంగ్రేటం చేశాడు.
టెస్టుల్లో 32 సెంచరీలు స్మిత్
2010లో లెగ్ స్పిన్నర్ గా ప్రయాణం కొనసాగిస్తున్న స్టీవ్ స్మిత్ క్రమంగా బ్యాటర్‌గా ఎదిగాడు. కెరీర్‌లో తొలి ఐదు టెస్టుల్లో రెండు అర్ధ సెంచరీలు సాధించిన స్మిత్‌ను టీమ్ మేనేజ్ మెంట్ బ్యాటర్‌గా గుర్తించలేదు. రెండేళ్ల తర్వాత మొహాలిలో టీమిండియాతో జరిగిన టెస్టు మ్యాచులో 92 పరుగులు చేసి తానెంటో నిరూపించుకున్నాడు. చూస్తుండగానే అత్యుత్తమ ప్రదర్శనలతో టెస్టుల్లో స్మిత్ శిఖరానికి చేరుకున్నాడు. ఇప్పటివరకూ 99 టెస్టుల్లో 59.56 సగటుతో 9,113 పరుగులు చేశాడు. ఇందులో 32 సెంచరీలు, 37 హాఫ్ సెంచరీలున్నాయి. డాన్ బ్రాడ్‌మన్ తర్వాత రెండో స్థానంలో నిలిచిన 'ఆధునిక బ్రాడ్‌మన్' అని స్మిత్ నిరూపించుకుంటున్నాడు.