టెస్టు క్రికెట్ రారాజు స్టీవన్ స్మిత్.. మరో రికార్డు సొంతం
ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం వేదికగా నిన్న మొదలైన యాషెస్ సిరీస్ రెండో టెస్టులో పలు రికార్డులు బద్దలయ్యాయి. ఇందులో ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవన్ స్మిత్ సాధించిన రికార్డు ప్రధానమైనది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 85 పరుగులతో అజేయంగా నిలిచిన స్మిత్, టెస్టు క్రికెట్లో 9వేల పరుగుల మైలురాయిని దాటాడు. మ్యాచుల పరంగా అత్యంత వేగంగా ఈ మార్క్ అందుకున్న ప్లేయర్‌గా స్టీవన్ స్మిత్ చరిత్రకెక్కాడు. ఇన్నింగ్స్ పరంగా చూస్తే స్మిత్ రెండో స్థానంలో నిలిచాడు. స్మిత్ 99వ టెస్టులో 9వేల రన్స్ మార్క్ అందుకున్నాడు. ఈ క్రమంలో ఇంతవరకూ ఈ రికార్డు ఉన్న బ్రియాన్ లారా(101)ను వెనక్కి నెట్టాడు.
అంతర్జాతీయ క్రికెట్లో 15వేల పరుగులు పూర్తి చేసిన స్మిత్
ఇన్నింగ్స్ పరంగా చూస్తే అత్యంత వేగంగా 9వేల రన్స్ చేసిన రికార్డు శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార్ సంగక్కర పేరిట ఉంది. సంగక్కర (172 ఇన్నింగ్స్) టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ (176 ఇన్నింగ్స్) లో ఈ మైలురాయిని చేరుకోగా, స్మిత్ 174వ ఇన్నింగ్స్ లో ఈ ఘనతను సాధించాడు. తొలి రోజు 42 ఓవర్లలో బౌండరీ బాది స్మిత్ 9వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. అదే విధంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లో కలిపి 15000 పరుగులను అతను పూర్తి చేసుకున్నాడు. వేగంగా 15వేల పరుగులను పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో స్మిత్ ఏడో స్థానంలో నిలిచాడు.