స్టీవ్ స్మిత్‌ను దారుణంగా ఎక్కిరించిన ఇంగ్లండ్ అభిమానులు
ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సిరీస్ 2023లో భాగంగా ఎడ్జబాస్టన్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ నాలుగో రోజు ఇంగ్లండ్ అభిమానులు ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ ను దారుణంగా అవమానించారు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఇంగ్లండ్ అభిమానులు స్మిత్ ను ఎగతాళి చేశారు. బాల్ టాంపరింగ్ ఉదంతాన్ని గుర్తు చేస్తూ పాట పాడుతూ వెకిలిగా వెక్కించారు. We Saw You Crying On Telly (నువ్వు టీవీలో ఏడుస్తుంటే మేము చూశాం) అంటూ స్టేడియం మొత్తం ముక్తకంఠంతో పాట పాడుతూ స్మిత్ మనసు గాయపడేలా ప్రవర్తించారు. స్టేడియంలో ప్రేక్షకులు ఇలా ప్రవర్తించడంతో స్మిత్ తెగ ఇబ్బంది పడ్డాడు.
ఇంగ్లండ్ ఫ్యాన్స్ తీరుపై నెటిజన్లు ఆగ్రహం
అవమానిస్తూ ఇంగ్లండ్ అభిమానులు పాట పాడటంతో స్మిత్ పైకి నవ్వుతూ ఇంకా పాడండి అంటున్నట్లు తల ఊపినా, ముఖంలో మాత్రం బాధ స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. ప్రస్తుతం ఇంగ్లండ్ ఫ్యాన్స్ తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి వ్యక్తినైనా ఈ తరహాలో ఎగతాళి చేయడం కరెక్ట్ కాదని చెప్పారు. అయితే ఆ సమయంలో బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లండ్ బ్యాటర్ ఓలీ రాబిన్సన్ ఇది వింటూ నవ్వుకోవడం గమనార్హం. ఈ మ్యాచులో ఇంగ్లండ్ గెలవాలంటే 7 వికెట్లు, ఆసీస్ గెలవాలంటే 174 పరుగులు చేయాల్సి ఉంటుంది.