LOADING...
Sushil Kumar: వారం రోజుల్లో సరెండర్‌ కావాల్సిందే.. రెజ్లర్ సుశీల్ కుమార్ బెయిల్‌ రద్దు చేసిన సుప్రీంకోర్టు 
రెజ్లర్ సుశీల్ కుమార్ బెయిల్‌ రద్దు చేసిన సుప్రీంకోర్టు

Sushil Kumar: వారం రోజుల్లో సరెండర్‌ కావాల్సిందే.. రెజ్లర్ సుశీల్ కుమార్ బెయిల్‌ రద్దు చేసిన సుప్రీంకోర్టు 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 13, 2025
12:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒలింపిక్‌ పతక విజేత,రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. వారం రోజుల్లో తప్పనిసరిగా సరెండర్‌ కావాలని ఆదేశాలు జారీ చేసింది. గత మార్చి 4న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ ఉత్తర్వులను జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌,జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా లతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్‌ రద్దు చేసింది. జూనియర్‌ జాతీయ రెజ్లింగ్‌ ఛాంపియన్‌ సాగర్‌ ధన్కర్‌ హత్య కేసులో సుశీల్‌ కుమార్‌పై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఈకేసులో ఇన్ని రోజులు అతనికి బెయిల్‌ ఇచ్చిన విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ,సాగర్‌ తండ్రి అశోక్‌ ధన్కర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈవిచారణలో సుశీల్‌ కుమార్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది మహేశ్‌ జెఠ్మలానీ,సాగర్‌ ధన్కర్‌ తరఫున న్యాయవాది సిద్ధార్థ మృదుల్‌ వాదనలు వినిపించారు.

వివరాలు 

కేసు నేపథ్యం 

2021లో ఢిల్లీ ఛత్రసాల్‌ స్టేడియంలో సుశీల్‌ కుమార్‌,సాగర్‌ ధన్కర్‌తో పాటు అతడి ఇద్దరు స్నేహితులపై దాడి చేశాడని కేసు నమోదైంది. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన ధన్కర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు పోస్టుమార్టం రిపోర్టు నిర్ధారించింది. ఈ ఘటన తర్వాత అరెస్ట్‌కు భయపడి సుశీల్‌ కుమార్‌ సుమారు 18 రోజులపాటు పరారీలో ఉన్నాడు. చివరికి ఢిల్లీలోని ముంద్కా ప్రాంతంలో ఒక జాతీయ స్థాయి అథ్లెట్‌ వద్ద నగదు తీసుకొని పారిపోతుండగా పోలీసులు అతన్ని పట్టుకున్నారు. అనంతరం బెయిల్‌ వచ్చే వరకు జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న సుశీల్‌ కుమార్‌ను రైల్వే శాఖ ఉద్యోగం నుంచి తొలగించింది.

వివరాలు 

ఈ కుట్రలో సుశీల్‌ కుమార్‌ ప్రధాన పాత్ర

అక్టోబర్‌ 2022లో ఢిల్లీ ట్రయల్‌ కోర్టు సుశీల్‌ కుమార్‌ సహా 17 మందిపై పలు తీవ్ర అభియోగాలు నమోదు చేసింది. వీటిలో హత్య,అల్లర్లు,నేరపూరిత కుట్ర, దోపిడీ, ఆయుధాల చట్టం కింద కేసులు ఉన్నాయి. ఢిల్లీ పోలీసుల ఛార్జ్‌షీట్‌ ప్రకారం, ఈ కుట్రలో సుశీల్‌ కుమార్‌ ప్రధాన పాత్ర పోషించినట్లు పేర్కొన్నారు. అయితే కుమార్‌ మాత్రం ఈ ఆరోపణలను ఖండించాడు. మూడున్నరేళ్ల పాటు జైలులో గడిపిన తనకు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ గత మార్చి 4న ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. హైకోర్టు అతడి వాదనలను పరిగణనలోకి తీసుకొని బెయిల్‌ మంజూరు చేసింది. కానీ తాజాగా సుప్రీంకోర్టు ఆ బెయిల్‌ను రద్దు చేయడంతో సుశీల్‌ కుమార్‌ మళ్లీ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.