World Cup 2023 : ప్రతి మ్యాచులోనూ సూర్య ఆడాలి.. అతని కంటే బెస్ట్ ఫినిషర్ ఏ జట్టులోనూ లేడు: భజ్జీ
వన్డే వరల్డ్ కప్ 2023 కు సమయం దగ్గర పడుతోంది. ఈ సమయంలో టీమిండియా తుది జట్టుపై చర్చ మొదలైంది. తాజాగా ఈ అంశంపై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. సూర్యకుమార్ యాదవ్‌ను ప్రతి మ్యాచులోనూ ఆడించాలని టీమిండియా యాజమాన్యానికి హర్భజన్ సింగ్ సూచించాడు. కొన్నేళ్ల నుంచి వన్డేల్లో రాణించలేకపోతున్న సూర్యకుమార్ యాదవ్, వన్డే ప్రపంచ కప్ దగ్గర పడుతుండటంతో ఫామ్‌లోకి వచ్చాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డేల్లో 50, రెండో వన్డేలో 72పరుగులు చేసి చెలరేగిపోయాడు. దీంతో అందరి ఫెవరేట్‌గా సూర్యకుమార్ యాదవ్ అయిపోయాడు. తాజాగా తన యూట్యూబ్ ఛానెల్లో సూర్యకుమార్ యాదవ్ గురించి హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలను చేశాడు.
సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ విన్నర్ : హర్భజన్
సూర్యకుమార్ యాదవ్ అన్ని మ్యాచులను ఆడాల్సిందేనని, అతడు ఎవరి స్థానంలో ఆడతాడన్నది తనకు అనవసరమని, కానీ అతని పేరు ముందు ఉండాలని, సూర్యకుమార్ పక్కా మ్యాచ్ విన్నర్ అని హర్భజన్ పేర్కొన్నారు. ఒంటిచేత్తో మ్యాచును గెలిపించే సత్తా సూర్యకు ఉందని, అతడు బెస్ట్ ఫినిషర్ అని, అతను ఖచ్చితంగా ఐదోస్థానంలో ఆడాలని భజ్జీ సూచించారు. తొలి మూడు స్థానాల్లో రోహిత్ శర్మ, గిల్, కోహ్లీ చోటు ఖాయంగా కనిపిస్తోంది. తర్వాత నాలుగు, ఐదు స్థానాల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఆ రెండు స్థానాల కోసం రాహుల్, శ్రేయస్, సూర్యకుమార్, ఇషాన్ కిషన్ మధ్య తీవ్ర పోటీ ఉంది. ఇక ఆరు, ఏడు స్థానాల్లో హార్దిక్ పాండ్యా, జడేజా బరిలోకి దిగే అవకాశముంది.