Suryakumar Yadav: విమర్శల నుంచి వరల్డ్‌కప్ వరకూ.. సూర్యకుమార్ యాదవ్ సారథ్యం ఎలా మారింది?
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు జరిగిన మీడియా సమావేశంలో ఒక జర్నలిస్టు 'సంజు సామ్సన్‌కు మరో అవకాశం ఇస్తారా?' అని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను ప్రశ్నించాడు. సాధారణంగా మరో కెప్టెన్ అయితే జట్టులోని 15మంది ఆటగాళ్లు సమర్థులే, పరిస్థితులను బట్టి తుది జట్టులో మార్పులు చేస్తాం,మ్యాచ్ సమయానికి నిర్ణయం తీసుకుంటాం అని సమాధానం ఇచ్చేవాడు. అయితే సూర్యకుమార్ మాత్రం కొంచెం వ్యంగ్యంగా నవ్వుతూ,'అభిషేక్‌ను తీసేయాలా...లేక తిలక్‌ను బయటకు పెట్టాలా?'అంటూ తిరిగి ప్రశ్నించాడు. అయితే పరిస్థితులు మారడంతో తర్వాతి మ్యాచ్‌లో జింబాబ్వేపై సంజు శాంసన్ కు అవకాశం ఇవ్వక తప్పలేదు. ఆతర్వాత శాంసన్ వరుసగా అద్భుత ప్రదర్శనలు చేసి జట్టును విజయపథంలో నడిపించాడు. చివరకు అదేజట్టు చాంపియన్‌గా నిలిచే వరకు అతని ప్రదర్శనలు కీలకంగా మారాయి.
వివరాలు
సూర్య కెప్టెన్‌గా 52 మ్యాచ్‌లలో భారత్ 40 విజయాలు
ఫైనల్‌కు ముందు ఆఫ్ స్పిన్ బౌలింగ్‌పై బ్యాటర్లు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రశ్నించగా కూడా సూర్యకుమార్ పెద్దగా స్పష్టత లేని సమాధానం ఇచ్చాడు. '120 స్ట్రయిక్‌రేట్‌తో ఆడుతూ కూడా ఫైనల్‌కు వచ్చాం కాబట్టి అలాగే ఆడతాం'అని చెప్పడం అతని నాయకత్వంలో ఉన్న అపరిపక్వతను చూపించింది. అయినా ఇప్పుడు ఆ విమర్శలన్నీ పక్కకు వెళ్లిపోయాయి.ఎందుకంటే జట్టుకు వరల్డ్ కప్‌ను అందించిన కెప్టెన్‌గా సూర్యకుమార్ పేరు చరిత్రలో నిలిచిపోయింది. అతను కెప్టెన్‌గా ఉన్న 52 మ్యాచ్‌లలో భారత్ 40 విజయాలు సాధించడం రికార్డుల పరంగా గొప్ప సారథ్యమే. అయితే వరల్డ్ కప్‌కు ముందు పరిస్థితి చూస్తే అతని ఫామ్ అంత గొప్పగా లేదు. వరుసగా 23 టి20 మ్యాచ్‌లలో ఒక్క అర్ధశతకం కూడా నమోదు కాలేదు.
వివరాలు
భారత్‌కు ప్రపంచకప్‌లు అందించిన కెప్టెన్ల సరసన సూర్య
జట్టు వరుస సిరీస్‌లు గెలుస్తున్నాకెప్టెన్‌గా అతని ప్రత్యేక ముద్ర కనిపించలేదని విమర్శలు వచ్చాయి. కోచ్ గౌతమ్ గంభీర్ సూచనలను మైదానంలో అమలు చేసే నాయకుడిగానే అతను కనిపిస్తున్నాడని, స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ కూడా లేదని గత రెండేళ్లుగా అనేక వ్యాఖ్యలు వినిపించాయి. ఇటీవల జరిగిన వరల్డ్ కప్‌లో కూడా'ఇదే కెప్టెన్ మాస్టర్ స్ట్రోక్'అనిపించే ప్రత్యేక వ్యూహాలు అతని నుంచి పెద్దగా కనిపించలేదు. అయినప్పటికీ జట్టులో ప్రతి ఆటగాడు తన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించడంతో భారత్ విజయపథంలో ముందుకు సాగింది. ఫలితంగా వరల్డ్ కప్ గెలిచి చరిత్ర సృష్టించింది.దీంతో భారత్‌కు ప్రపంచకప్‌లు అందించిన కెప్టెన్ల జాబితాలో కపిల్ దేవ్,మహేంద్ర సింగ్ ధోనీ,రోహిత్ శర్మల సరసన ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ పేరు కూడా చేరింది.
వివరాలు
హార్దిక్ పాండ్యానే టీమ్‌కు కెప్టెన్?
నిజానికి రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత టి20ల్లో సూర్యకుమార్ కెప్టెన్సీకి ఆటోమేటిక్ ఎంపిక కాదు. బ్యాటర్‌గా మంచి పేరు ఉన్నా నాయకుడిగా పెద్దగా అనుభవం లేదు. 2024 వరల్డ్ కప్ విజయం తర్వాత అప్పటి ఫామ్,అనుభవం బట్టి చూస్తే హార్దిక్ పాండ్యానే టీమ్‌కు కెప్టెన్ అవుతాడని చాలా మంది భావించారు. అయితే కొన్ని క్రికెటేతర కారణాల వల్ల పాండ్యాను కెప్టెన్సీ నుంచి దూరంగా ఉంచారు. ఆ తర్వాత బాధ్యతలు చేపట్టిన సూర్య వరుస విజయాలతో తన స్థానాన్ని బలపరిచాడు.
వివరాలు
వరుస సిరీస్‌లు, ఆసియా కప్
శ్రీలంక,బంగ్లాదేశ్,దక్షిణాఫ్రికా,ఆస్ట్రేలియా,న్యూజిలాండ్‌లపై వరుస సిరీస్‌లు గెలుచుకోవడంతో పాటు ఆసియా కప్‌ను కూడా భారత్ ఖాతాలో వేసింది. మధ్యలో అతని వ్యక్తిగత ఫామ్ బలహీనంగా ఉండటంతో కెప్టెన్సీ నుంచి తప్పించాలని చర్చలు వచ్చినా వరల్డ్ కప్‌కు సమయం తక్కువగా ఉండటంతో బీసీసీఐ అలాంటి నిర్ణయం తీసుకోలేదు. చివరకు వరల్డ్ కప్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో అన్ని జట్లను వెనక్కు నెట్టింది. ఫలితంగా ట్రోఫీని అందుకుని సూర్యకుమార్ విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు.