Surya Kumar Yadav: టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ చరిత్రను సృష్టిస్తాడు : నాజర్ హుస్సేన్
భారత స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav) టీ20ల్లో చెలరేగిపోతున్నాడు. ప్రస్తుతం టీ20ల్లో టాప్ ర్యాంకర్‌గా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే వన్డేల్లోకి వచ్చేసరికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా వన్డే వరల్డ్ కప్ 2023లో అతడి ఆటతీరును చూసిన అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. ఇప్పటివరకూ 60 టీ20లు ఆడి ఆడి నాలుగు శతకాలు, 17 హాఫ్ సెంచరీలు బాదాడు. ఈ క్రమంలో ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్‌లో సూర్యకుమార్ యాదవ్‌పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ సూర్యకుమార్ పై ప్రశంసల వర్షం కురిపించాడు.
టీ20 వరల్డ్ కప్ లో సూర్యకుమార్ అత్యధిక పరుగులు చేయగలడు
టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ విలక్షణ ప్లేయర్ అని, మిస్టర్ 360 పేరును సార్థకం చేస్తాడని నాజర్ హుస్సేన్ పేర్కొన్నాడు. అయితే వన్డేల్లోకి వచ్చేసరికి అతడి పరిస్థితి వేరుగా ఉంటుందని, ఏం చేయాలనేదానిపైనా స్పష్టత లేకపోవడంతోనే వన్డేల్లో ఇబ్బంది పడుతున్నాడని వెల్లడించారు. పోట్టి ఫార్మాట్‌లో సూర్య బ్యాటింగ్ చూడడం మజాగా అనిపిస్తుందని, వచ్చే టీ20 ప్రపంచ కప్‌లో అత్యధిక పరుగులు చేసే ఆటగాడిగా సూర్య నిలుస్తాడని హుస్సేన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ సారి టీ20 ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికా జట్టు విజేతగా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జోష్యం చెప్పారు.