Syed Mushtaq Ali Trophy: టీ20ల్లో బరోడా రికార్డు స్కోరు.. ఇన్నింగ్స్‌లో 37 సిక్సర్లు..
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రికార్డుల పరంపర కొనసాగుతోంది. ఇటీవల ఉర్విల్ పటేల్ అత్యంత తక్కువ బంతుల్లో వరుసగా సెంచరీలు సాధించిన బ్యాటర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా బరోడా జట్టు టీ20ల్లోనే అత్యధిక పరుగులు చేసిన జట్టుగా చరిత్రలో నిలిచింది. ఇప్పటివరకు ఈ రికార్డు జింబాబ్వే పేరిట ఉండేది. గాంబియాపై 2023 అక్టోబర్‌లో 344/4 స్కోరు చేసి జింబాబ్వే ఈ ఘనత సాధించింది. అయితే ఇప్పుడు ఆ రికార్డును అధిగమించి బరోడా ఐదు వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసి ప్రపంచ టీ20 క్రికెట్‌లోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది.
సిక్కింకు భారీ పరాజయం
సిక్కింకు వ్యతిరేకంగా జరిగిన ఈ మ్యాచ్‌లో,తొలుత బ్యాటింగ్ చేసిన బరోడా 349/5 పరుగులు చేసింది. భాను పానియా(నాటౌట్ 134; 51 బంతుల్లో 5 ఫోర్లు, 15 సిక్సర్లు),శివాలిక్ శర్మ (55; 17 బంతుల్లో), అభిమన్యు సింగ్ (53; 17 బంతుల్లో),సోలాంకి (50; 16 బంతుల్లో),షష్వాత్ రావత్ (43; 16 బంతుల్లో) అదిరిపోయే ఆటతీరు కనబరిచారు. వీరు బంతులను ఎడాపెడా బాదుతూ పరుగుల వరద పారించారు.ఆపై భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన సిక్కిం జట్టు పూర్తి విఫలమైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి కేవలం 86 పరుగులే చేయగలిగింది. ఈ కారణంగా బరోడా 263 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
అరుదైన ఘనత
ఈ మ్యాచ్‌లో భారత స్టార్ హార్దిక్ పాండ్య ఆడకపోవడం గమనార్హం, ఆయన స్థానంలో కృనాల్ పాండ్య జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించాడు. టీ20 క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అత్యధిక వ్యత్యాసంతో గెలిచిన నాలుగో జట్టుగా బరోడా నిలిచింది. మొదటి స్థానంలో జింబాబ్వే 290 పరుగుల తేడాతో గాంబియాను ఓడించగా, నేపాల్ 273 పరుగులతో మంగోలియాపై, నైజీరియా 264 పరుగులతో ఐవరీ కోస్ట్‌పై ఈ ఘనత సాధించాయి.