Jasprit Bumrah: టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా ఆస్తుల నుంచి ప్రేమకథ వరకు..!
భారత టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్‌గా కొనసాగుతున్న ఫాస్ట్ బౌలర్ జస్పిత్ బుమ్రా, భారత జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. టీమిండియా జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలను బుమ్రా అందించాడు. అయితే బుమ్రా వ్యక్తిగత జీవిత వివరాలు, ఆర్థిక స్థితి, కుటుంబం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. జస్ప్రీత్ బుమ్రా 2013లో ఐపీఎల్ ద్వారా తన ప్రయాణం ప్రారంభించాడు. మొదట్లో పెద్దగా ఆదాయం రాకపోయినా, 2018నాటికి ఒక్క సీజన్‌లోనే రూ.7 కోట్ల ఆదాయం సమకూర్చుకున్నాడు. ప్రస్తుతం ప్రతి సీజన్‌కు రూ.12 కోట్ల సంపాదనతో ఐపీఎల్‌లో కొనసాగుతున్నాడు.
ప్రముఖ బ్రాండ్లతో కాంట్రాక్టులు
మొత్తం 2013-2024 మధ్య ఐపీఎల్ ద్వారా దాదాపు రూ.60 కోట్లు సంపాదించాడు. బీసీసీఐ బుమ్రాకు టాప్ గ్రేడ్ కాంట్రాక్ట్ అందించింది. ఈ కాంట్రాక్ట్ ద్వారా ఒక్కో సీజన్‌కు రూ.7 కోట్లు లభిస్తాయి. టెస్టు మ్యాచ్‌కు రూ.15 లక్షలు, వన్డేకు రూ.7 లక్షలు, టీ20 మ్యాచ్‌కు రూ.3 లక్షల చొప్పున ఆదాయం ఉంటుంది. మొత్తం మీద, బీసీసీఐ ద్వారా ప్రతి ఏడాదిలో దాదాపు రూ.10 కోట్లకు పైగా సంపాదిస్తున్నాడు. ప్రఖ్యాత బ్రాండ్లైన జెప్టో, డ్రీమ్ 11 వంటి సంస్థలతో జస్ప్రీత్ బుమ్రా జత కట్టాడు. ఈ బ్రాండ్లకు ప్రమోషన్ చేయడం ద్వారా బుమ్రా కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నారు.
ముంబై, అహ్మదాబాద్ లో ఇళ్లులు
కార్లంటే బుమ్రాకు ప్రత్యేకమైన ఇష్టం. మెర్సిడెస్, నిస్సాన్, రేంజ్ రోవర్ వెలార్, ఇన్నోవా క్రిస్టా, హ్యుందాయ్ వెన్యూ వంటి కార్లు కలిగి ఉన్నాడు. అతని నికర ఆస్తి విలువ సుమారు రూ.80 కోట్లు. బుమ్రాకు ముంబై, అహ్మదాబాద్‌లో ఇళ్లు ఉన్నాయి. ముంబై ఇంటి ధర సుమారు రూ.2 కోట్లు కాగా, అహ్మదాబాద్ ఇంటి ధర దాదాపు రూ.3 కోట్లు. బుమ్రా స్పోర్ట్స్ ప్రెజెంటర్ సంజనా గణేశన్‌ను 2021లో వివాహం చేసుకున్నాడు. ఈ జంట 2023 సెప్టెంబరు 4న మగబిడ్డకు జన్మనిచ్చారు. తమ కుమారుడికి అంగద్ అనే పేరు పెట్టారు.