AUS vs IND: మళ్లీ పతనమైన టీమిండియా.. పింక్ బాల్ టెస్టులో ఆస్ట్రేలియాదే పైచేయి
ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. ఆస్ట్రేలియా, రెండో రోజు కూడా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ, మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించింది. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 337 పరుగులు చేసిన తర్వాత, టీమిండియా 180 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియాకు 157 పరుగుల ఆధిక్యం ఏర్పడింది. ఈ ఇన్నింగ్స్‌లో ట్రావిస్ హెడ్ 140 పరుగులతో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. మరొక కీలక బ్యాటర్ అయిన మార్నస్ లాబుస్చెన్ 64 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. 157 పరుగుల భారీ లోటుతో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కి దిగింది. కానీ భారత బ్యాటర్లు చాలా నిరాశపరిచారు.
నిరాశపరిచిన భారత బ్యాటర్లు
కేఎల్ రాహుల్ 7, యశస్వి జైస్వాల్ 24, విరాట్ కోహ్లీ 11, శుభ్‌మన్ గిల్ 28, రోహిత్ శర్మ 6 పరుగులతో పెవిలియన్ బాట పట్టారు. ఆస్ట్రేలియా బౌలర్లలో పాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్, మిచెల్ స్టార్క్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. కమిన్స్, బోలాండ్ చెరో 2 వికెట్లు తీసుకోగా, స్టార్క్ 1 వికెట్ తీశారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి, టీమిండియా 24 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. రిషబ్ పంత్ (28) నితీష్ రెడ్డి (15) క్రీజులో ఉన్నారు. టీమిండియా ఇంకా 29 పరుగుల వెనుకంజలో ఉంది.