
Team India: స్పాన్సర్ లేకుండా ఆసియా కప్‌లో బరిలోకి టీమిండియా.. జెర్సీపై ఏముందంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్‌లో ఈసారి టీమిండియా జెర్సీపై ఎలాంటి స్పాన్సర్ లోగో ఉండదు. ఆటగాళ్లు ధరించే జెర్సీ ముందు భాగంలో కేవలం "INDIA" అనే పదమే కనిపించనుంది. గతంలో జెర్సీపై "INDIA" పదంతో పాటు స్పాన్సర్ కంపెనీ డ్రీమ్ 11 లోగో కూడా ఉండేది. అయితే తాజాగా బీసీసీఐ,డ్రీమ్11 తో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసింది. ఈ నిర్ణయం వెనుక కారణం ఏమిటంటే, గత నెలలో భారత ప్రభుత్వం ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లుని ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం రియల్ మనీ గేమ్స్ నిషేధం విధించబడింది. దాంతో, డ్రీమ్11 స్పాన్సర్‌షిప్ కొనసాగడం సాధ్యంకాక బీసీసీఐ ఒప్పందాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో కొత్త స్పాన్సర్ల కోసం బీసీసీఐ ప్రకటన చేసింది.
వివరాలు
రూ.358 కోట్ల ఒప్పందం రద్దు
డ్రీమ్11- బీసీసీఐ మధ్య 2023లో సంతకం చేసిన ఒప్పందం విలువ US$44 మిలియన్ (సుమారు రూ. 358 కోట్లు). ఈ ఒప్పందం ప్రకారం, డ్రీమ్11 కి 2026 వరకు భారత జట్టు జెర్సీపై స్పాన్సర్‌షిప్ హక్కులు ఉండేవి. కానీ కొత్త బిల్లుతో రియల్ మనీ గేమింగ్ నిషేధం రావడంతో ఆ ఒప్పందం చెల్లుబాటు కాకుండా పోయింది.
వివరాలు
ఆసియా కప్‌కు ముందు కొత్త స్పాన్సర్ ఎందుకు రాలేదు?
బీసీసీఐ, కొత్త స్పాన్సర్ కోసం సెప్టెంబర్ 2న టెండర్ (ITT) ప్రకటన చేసింది. ఆసక్తిగల కంపెనీలు సెప్టెంబర్ 12 వరకు టెండర్‌ను కొనుగోలు చేయగలవు. తుది బిడ్‌లు సెప్టెంబర్ 16న సమర్పించాలి. అయితే ఆసియా కప్ సెప్టెంబర్ 9న ప్రారంభం, టీం ఇండియా తన తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న ఆడనుంది. రెండో మ్యాచ్ సెప్టెంబర్ 14న పాకిస్తాన్‌తో, మూడో మ్యాచ్ సెప్టెంబర్ 19న జరగనుంది. బిడ్డింగ్ ప్రక్రియ సెప్టెంబర్ 16న మాత్రమే పూర్తవుతుందనగా, భారత జట్టు మొదటి రెండు మ్యాచ్‌ల్లో స్పాన్సర్ లేకుండా ఆడడం ఖాయం.
వివరాలు
స్పాన్సర్‌షిప్‌కు కఠినమైన షరతులు
కొత్త స్పాన్సర్ల ఎంపికలో బీసీసీఐ స్పష్టమైన నిబంధనలు పెట్టింది. మద్యం, జూదం, బెట్టింగ్, క్రిప్టోకరెన్సీ, రియల్ మనీ గేమ్స్, పొగాకు లేదా అశ్లీలతకు సంబంధించిన కంపెనీలను పూర్తిగా టెండర్ ప్రక్రియ నుంచి తప్పించింది. ప్రజా నైతికతకు భంగం కలిగించే సంస్థలకు జట్టుతో స్పాన్సర్‌షిప్ చేసే అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేసింది.