LOADING...
World Cup 2027: వన్డే ప్రపంచకప్‌పై టీమ్‌ఇండియా ఫోకస్‌.. ముందస్తు ప్రణాళికతోనే విజయావకాశాలు
వన్డే ప్రపంచకప్‌పై టీమ్‌ఇండియా ఫోకస్‌.. ముందస్తు ప్రణాళికతోనే విజయావకాశాలు

World Cup 2027: వన్డే ప్రపంచకప్‌పై టీమ్‌ఇండియా ఫోకస్‌.. ముందస్తు ప్రణాళికతోనే విజయావకాశాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 12, 2026
01:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 క్రికెట్‌ ప్రభావం పెరగడంతో గత కొన్ని సంవత్సరాల్లో వన్డే మ్యాచ్‌లకు ఆదరణ కొంత తగ్గిన మాట వాస్తవమే. వన్డే మ్యాచ్‌ల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. అయినప్పటికీ క్రికెట్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన టోర్నీగా ఇప్పటికీ వన్డే ప్రపంచకప్‌కే ప్రత్యేక స్థానం ఉంది. రెండేళ్లకు ఒకసారి జరిగే టీ20 ప్రపంచకప్‌తో పోలిస్తే.. నాలుగేళ్లకోసారి జరిగే వన్డే ప్రపంచకప్‌ను క్రికెటర్లు మరింత గొప్పగా భావిస్తారు. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో భారత్‌ ఇప్పటివరకు రెండు సార్లు విజేతగా నిలిచింది. 1983లో కపిల్‌ దేవ్‌ నాయకత్వంలోని జట్టు తొలి ప్రపంచకప్‌ను గెలుచుకోగా.. 2011లో మహేంద్ర సింగ్‌ ధోనీ సారథ్యంలో టీమ్‌ఇండియా మళ్లీ ఛాంపియన్‌గా నిలిచింది.

వివరాలు 

2023 ప్రపంచకప్‌లో ఫైనల్లో భారత్ ఓటమి

అయితే ఆ తర్వాత జరిగిన మూడు ప్రపంచకప్‌లలో భారత్‌కు విజయం దక్కలేదు. ముఖ్యంగా 2023 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ.. ఫైనల్లో ఓటమితో కప్పు చేజారింది. ఇప్పుడు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న వచ్చే వన్డే ప్రపంచకప్‌పై భారత్‌ దృష్టి పెట్టింది. గత 20 నెలల్లో రెండు టీ20 ప్రపంచకప్‌లు గెలుచుకుని పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని చాటిన టీమ్‌ఇండియా.. అదే ఊపులో వన్డే ప్రపంచకప్‌ను కూడా గెలవాలని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే దీనికోసం ముందుగానే పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది.

వివరాలు 

యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు

టీ20 ప్రపంచకప్‌ విజయానికి ముందు కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌, కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ కలిసి ఇదే విధానాన్ని అనుసరించారు. చాలా ముందుగానే జట్టు నిర్మాణంపై స్పష్టతకు వచ్చి..యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇచ్చారు. ఫలితంగా అభిషేక్‌ శర్మ, తిలక్‌ వర్మ వంటి యువకులు జట్టులో కీలక పాత్ర పోషించే స్థాయికి ఎదిగారు. టోర్నీ సమీపంలో జట్టు అవసరాలను బట్టి కొన్ని మార్పులు కూడా చేశారు. శుభ్‌మన్‌ గిల్‌కు అవకాశం ఇచ్చినా అతను దాన్ని సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. వన్డేలు,టెస్టుల్లో కెప్టెన్‌గా ఉన్నప్పటికీ.. ప్రదర్శన బలహీనంగా ఉండటంతో అతనిపై వేటు వేయడానికి కూడా వెనుకాడలేదు. అలాగే జితేశ్‌ శర్మను తప్పించి జట్టు టాప్‌ ఆర్డర్‌కు సరిపోయేలా ఇషాన్‌ కిషన్‌ను ఎంపిక చేయడం వ్యూహాత్మక నిర్ణయంగా మారింది.

Advertisement

వివరాలు 

జట్టు ప్రయోజనాల కోసం అవసరమైతే కఠిన నిర్ణయాలు

ఈ నిర్ణయాలన్నీ టీమ్‌కు మంచి ఫలితాలను అందించాయి.ఇప్పుడు వన్డే ప్రపంచకప్‌ కోసం కూడా ఇదే తరహా వ్యూహంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. జట్టు ప్రయోజనాల కోసం అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకోవడానికీ వెనుకాడకూడదు. ముందుగానే జట్టు నిర్మాణంపై స్పష్టతకు వచ్చి..ప్రపంచకప్‌కు ఎంపిక చేయదగిన ఆటగాళ్లతో ఒక పూల్‌ను సిద్ధం చేయడం కీలకం. వచ్చే ఏడాదిన్నరలో టీమ్‌ఇండియా ఎక్కువగా వన్డే సిరీస్‌లు ఆడేలా చూడటం..అలాగే ప్రపంచకప్‌ వేదిక అయిన ఆఫ్రికా దేశాల్లో పర్యటనలు నిర్వహించడం వంటి అంశాలపై బీసీసీఐ దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడున్న రెండు నెలలు ఐపీఎల్‌ హడావుడి కొనసాగుతుంది.ఈ సమయంలో కోచ్‌ గంభీర్‌ తన సిబ్బందితో కలిసి వన్డే ప్రపంచకప్‌ కోసం వ్యూహాలు రూపొందిస్తే..జూన్‌ నుంచి వాటిని అమల్లోకి తీసుకురావచ్చు.

Advertisement

వివరాలు 

బంతి విభాగం బలపడాలి

భారత్‌కు బ్యాటింగ్‌ విభాగంలో ఎప్పుడూ బలం ఉంది. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్‌లో కూడా అదే పరిస్థితి కనిపించింది. అయితే బౌలింగ్‌ విషయంలో మాత్రం కొంత అస్థిరత కొనసాగుతూనే ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. సరైన ప్రత్యామ్నాయాలు పూర్తిగా అందుబాటులో లేకపోయినా.. మహ్మద్‌ షమీని సెలక్టర్లు పూర్తిగా పక్కన పెట్టారు. ప్రస్తుతం సిరాజ్‌,అర్ష్‌దీప్‌ సింగ్‌,హర్షిత్‌ రాణా,ప్రసిద్ధ్‌ కృష్ణ వంటి బౌలర్లు అంతగా స్థిరమైన ప్రదర్శన ఇవ్వలేకపోతున్నారు. దీంతో షమిని మళ్లీ జట్టులోకి తీసుకోవాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అతను గత ఏడాది నుంచి దేశవాళీ క్రికెట్‌లో మంచి ప్రదర్శన చేస్తూ నిలకడ చూపిస్తున్నాడు. ప్రపంచకప్‌ వరకు ఫిట్‌నెస్‌ను కాపాడుకోగలిగితే అతనికి మరో అవకాశం ఇవ్వడంలో తప్పేమీ ఉండదని విశ్లేషకులు భావిస్తున్నారు.

వివరాలు 

బంతి విభాగం బలపడాలి

రంజీ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శనతో ఆకిబ్‌ నబి కూడా సెలక్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్న అతను టోర్నీలో తన ప్రతిభను నిరూపించగలిగితే.. భవిష్యత్తు దృష్ట్యా ప్రపంచకప్‌ కోసం అతణ్ని సిద్ధం చేయవచ్చు. అలాగే మరికొన్ని పేస్‌ బౌలింగ్‌ ప్రత్యామ్నాయాలను కూడా సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్పిన్‌ విభాగంలో కూడా టీమ్‌ఇండియా ఒకప్పటి స్థాయిలో బలంగా కనిపించడం లేదు. వరుణ్‌ చక్రవర్తి ప్రభావం కొంత తగ్గింది. కుల్‌దీప్‌ యాదవ్‌కు మరిన్ని అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే రవి బిష్ణోయ్‌పైనా సెలక్టర్లు దృష్టి పెట్టాలి. మొత్తంగా చూస్తే బౌలింగ్‌ విభాగంలో భారత్‌ మరింత బలపడాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది.

వివరాలు 

రోహిత్‌, కోహ్లి కొనసాగుతారా?

2027 వన్డే ప్రపంచకప్‌ గురించి చర్చ మొదలైనప్పుడల్లా అందరి దృష్టి విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మలపై పడుతోంది. 2023 ప్రపంచకప్‌నే వీరిద్దరికీ చివరిదిగా భావించిన వారు చాలామంది ఉన్నారు. అప్పటికి రోహిత్‌ వయసు 35 సంవత్సరాలు కాగా.. కోహ్లి 34 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. మరో నాలుగేళ్లు ఫామ్‌, ఫిట్‌నెస్‌ను నిలబెట్టుకోవడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ప్రపంచకప్‌ ముగిసి రెండున్నరేళ్లు అవుతున్న సమయంలో వీరిద్దరూ ఇప్పటికీ మంచి ఫామ్‌లోనే కొనసాగుతున్నారు. 2024 టీ20 ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఈ ఇద్దరూ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు చెప్పారు. అలాగే ఇటీవల టెస్టు క్రికెట్‌ నుంచి కూడా తప్పుకున్నారు. దీంతో వన్డేల్లో కొనసాగుతారా అనే సందేహాలు కొంతకాలం కనిపించాయి.

వివరాలు 

రోహిత్‌, కోహ్లి కొనసాగుతారా?

కానీ ఇటీవల జరిగిన మూడు వన్డే సిరీస్‌ల్లోనూ రోహిత్‌, కోహ్లి అద్భుత ప్రదర్శన చేశారు. ఫిట్‌నెస్‌ పరంగానూ వారికి పెద్దగా సమస్యలు కనిపించడం లేదు. ముఖ్యంగా రోహిత్‌ శర్మ గతంలో కంటే బరువు తగ్గి మరింత ఫిట్‌గా కనిపిస్తున్నాడు. రాబోయే ఐపీఎల్‌లో కూడా ఈ ఇద్దరూ మంచి ప్రదర్శన చేస్తే.. ప్రపంచకప్‌ ఆడే దిశగా తమ సన్నద్ధతను మరింత స్పష్టం చేసినట్లే అవుతుంది. అయితే ప్రపంచకప్‌ వరకు వచ్చే ఏడాది కాలంలో ఫామ్‌, ఫిట్‌నెస్‌ను నిలబెట్టుకోవడం వారికి అత్యంత కీలకం. ప్రదర్శన బాగుంటే వారి స్థానాలకు ఎలాంటి ప్రమాదం ఉండదు.

Advertisement